పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా శాంతిని మీకు దయచేస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగాగాక స్థిరంగాను శాశ్వతంగాను వుండేశాంతిని మీకు ప్రసాదిస్తున్నాను అన్న నీ వాగ్దానాన్ని నమ్మకొని జీవించే భాగ్యాన్ని దయచేయి.

25. స్నేహితుల కొరకు

పితపుత్రుల ప్రేమబంధానివైన పవిత్రాత్మమా! నేనెవరిపట్ల ప్రేమా స్నేహమూ చూపుతూంటానో వాళ్ళందరినీ కనికరించు. నా స్నేహితులను సకలాపదలనుండి కాపాడు. వారి కార్యాల్లో వారికి తోడుగావుండి విజయాన్ని ప్రసాదించు. బాధల్లో వారికి ఓదార్చుని దయచేయి. ఆందోళనం చెందినపుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించు, ఎల్లవేళల వారికి చిత్తశాంతినీ ఆనందాన్నీ అనుగ్రహించు. వారి హృదయాలను ప్రేమభావంతో నింపి వారిని నీచెంతకు రాబట్టుకో.

26. చిరాకు కలిగినప్పడు

ప్రభూ! నేను కొన్నిసారులు నిరుత్సాహానికీ అధైర్యానికీ విషాదానికీ గురౌతూంటాను. ఇతరులు పలికే పలుకులూ, చేసే పనులూ, నా చుటూ జరిగే సంఘటనలూ నన్ను చీకాకు పెడతాయి. ఈలాంటి వ్యాకుల పరిస్థితుల్లో నేను నిన్ను శరణు వేడేలా అనుగ్రహించు. నామీద నేను జాలిపడుతూ క్రుంగిపోయేపుడు నన్ను ఓదార్చి నాకు మనోబలాన్ని దయచేసేవాడివి నీవే. నీవు నాకు గుండె నిబ్బరాన్ని దయచేస్తే చాలు, నేనెంతటి వేదననైనా సహించగలను.

27. దేవునికి వందనాలు

ప్రభూ! మేము వసించే ఈ యింటికిగాను నీకు వందనాలు. మేమందరం కలసి ప్రేమతో ఐక్యభావంతో జీవిస్తున్నందులకు నీకు వందనాలు. మేము ఆరోగ్యంగా వున్నందుకూ. రోజూ కష్టపడి పనిజేసి భోజనం సంపాదించు కొంటూన్నందుకూ నీకు వందనాలు. మాకు ఇరుగు పొరుగు వారినీ స్నేహితులనూ బంధువులనూ దయచేసినందులకు నీకు వందనాలు, నీవు మా బంధుమిత్రాదులను కాపాడు, మా శత్రువులకూ మాకూగల విరోధాన్ని రూపుమాపు. నీచేయెత్తి మమ్మ దీవించు. జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకులను మేము ఓర్పుతో భరించేలా చేయి. కష్టాల్లో ధైర్యంగా వుండేలా దయచేయి.