పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22. మన కార్యాల్లో మంచి ఉద్దేశం

మానవకోటికి విమోచకుడవైన ప్రభూ! నా హృదయంలో సదుద్దేశం లేనందున నేను చేసే పనులు నిప్రయోజనమై పోకుండునుగాక. తరచుగా నేను ప్రజల మెప్పకొరకే ఆయా కార్యాలు చేస్తుంటానని వినయంతో ఒప్పకొంటున్నాను. ప్రభూ! నేను చేసే పనుల్లో మంచి ఉద్దేశం లోపింపకుండునుగాక. నీ ప్రీతికొరకూ మోక్షభాగ్యం కొరకూ మాత్రమే నా పనులను చేయుదునుగాక. ప్రజల మెప్పకొరకూ, స్వార్థ ప్రీతికొరకూ, నా బడాయి కొరకూ ఏ పనులూ చేయకుందునుగాక. తల్లీ మరియమాతా! రహస్యంగా అందరి కార్యాలను గుర్తించే తండ్రి నన్నుగూడ బహూకరించేట్ల నా పనులను నేను సదుద్దేశంతో నెరవేర్చే భాగ్యాన్ని నీవు నాకు సంపాదించిపెట్ట.

23. పవిత్రాత్మమా! నన్ను పవిత్రపరచు

పవిత్రాత్మమా! నీ శ్వాసను నా మీదకు ఊది నా యాలోచనలు పవిత్రంగా వుండేలా చేయి. నాపై నీ ప్రభావంజూపి నా క్రియలు పవిత్రంగా వుండేలా చేయి. నన్ను ఆకర్షించి నేను పవిత్రమైన కార్యాలను మాత్రమే కోరుకొనేలా చేయి. నన్ను బలపరచి నేను పవిత్రమైన విషయాలను మాత్రమే సమర్ధించేలా చేయి. పాపం నుండి నన్ను కాపాడి నేను నిరంతరం పవిత్రంగా జీవించేలా చేయి.

24. అభయదానం కొరకు

ప్రభూ! చాలసారులు నేను భవిష్యత్తులో ఏంజరుగుతుందోనని ఆందోళనం చెందుతూంటాను. నాకేమి కీడుమూడుతుందోననీ, నా పనికి ఏమి అంతరాయం కలుగుతుందోననీ, నా ఉద్యోగానికి ఏమి ప్రమాదం కలుగుతుందోనని భయబడుతూంటాను. నామీద ఆధారపడి జీవించేవాళ్ళకు ఏమికీడు వాటిల్లుతుందోననీ, నా కుటుంబ సభ్యులకు ఏమిహాని కలుగుతుందోననీ శంకిస్తూంటాను. నన్ను ఏమివ్యాధి పీడిస్తుందోననీ, నాకు మల్లా పూర్ణారోగ్యం చేకూరుతుందో లేదోననీ అనుమానిస్తూంటాను. నాకు విజయం సిద్ధిస్తుందో లేదోననీ, ఓటమి పాలై అవమానం తెచ్చుకొంటానేమోననీ భయపడుతూంటాను. ఒకోసారి చిన్న ఆటంకాలకే కంగారుపడిపోతూంటాను. ఈ యాందోళనలన్నిటినీ అణచుకోవాలన్నా అణచుకోలేక పోతున్నాను. ప్రభూ! నేను నా మంచి చెడ్డలను నీకే వదలివేసి చిత్తశాంతితో జీవించేలా చేయి. నీ సాన్నిధ్య బలాన్నీనీ యాశీస్సులనూ నమ్మి జీవిస్తే నాకుగాని నావారికిగాని ఏయాపదా రాదని విశ్వసించే భాగ్యాన్ని దయచేయి.