పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. అంతర దృష్టి

ప్రభూ! నీవు ఆనాడు గ్రుడ్డివారి నేత్రాలను వలె నేడు మా నేత్రాలను గూడ విప్పు. మాకు అంతర్దృష్టిని దయచేయి. మేము కంటికి కన్పించే భౌతిక వస్తువుల్లోకూడ కంటికి కన్పించని దివ్యవస్తువులను దర్శించేలా చేయి. మా కన్నులు వర్తమాన వస్తువులనేగాక రాబోయే దివ్యవస్తువులను గూడ దర్శించేలా చేయి. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో గ్రహించి శాశ్వత వస్తువులకు ఈయవలసిన విలువను ఇచ్చేలా చేయి.

19. తోడివారికి సేవ

తండ్రీ! నీవు నన్ను సృజించినవాడివి. నా కెన్నో శక్తిసామర్థ్యాలు దయచేసి నేనేదో మంచిని సాధించాలని కోరుకోన్నవాడివి. నీవు నాకు దయచేసిన వరాలతో నేను నీకు ఉచితమైన సేవ చేయాలి. నా హృదయాన్నీ మేధనూ ప్రేరేపించి నేను నేటి దేశావసరాలను చక్కగా గుర్తించేలా చేయి. అక్కరలోవున్న తోడివారికి ఏదైనా మేలు చేయాలనే బలమైన సంకల్పాన్ని నాలో రేకెత్తించు. నేను చేయగల ఓ ఉత్తమ సేవను ఎన్నుకొని దాన్ని పట్టుదలతో చేసి ముగించే భాగ్యాన్ని దయచేయి. నేను తోడివారికి మేలుచేసి నీకు కీర్తినీ మహిమనూ కొనివచ్చేలా అనుగ్రహించు.

20. దైవసహాయం కొరకు

నాకు సహాయకుడవూ రక్షకుడవూ ఐన ప్రభూ! నా ప్రార్థనను ఆలించు. నేను అసత్యాన్ని విడనాడి సత్యాన్ని చేపట్టేలా చేయి. కామప్రవృత్తిని విడనాడి నిర్మల హృదయంతో జీవించేలా చేయి, అపవిత్రాలోచనలను త్రోసివేసి నా మనస్సును దివ్యమైన భావాలతో నింపుకొనేలా చేయి. నిరాశను విడనాడి నిన్ను నమ్మి జీవించేలా చేయి. నులివెచ్చనితనాన్ని విడనాడి దైవభక్తితో జీవించేలా చేయి. తొందరపాటును పరిత్యజించి ఓర్పుతో మెలిగేలా చేయి. శోధనలను త్రోసివేసి ప్రార్థనకు పూనుకొనేలా చేయి. సోమరితనానికి లొంగక కష్టపడి పనిచేసికొనేలా అనుగ్రహించు.

21. మరణ పర్యంతం వరప్రసాదస్థితిలో

మాకు రక్షకుడవైన ప్రభూ! నీ సిలువ మరణం ద్వారా నీవు మాకు పాపవిమోచనాన్నీ మరణ పర్యంతం వరప్రసాదస్థితిలో స్థిరంగా వుండిపోయి అటుపిమ్మట మోక్షంలో నిన్ను దర్శించి ఆనందించే భాగ్యాన్నీ దయచేస్తావని నమ్ముతూన్నాం. దయాపూరితాలైన నీ వాగ్గానాల ద్వారా ఈ భాగ్యం మాకు లభిస్తుందని విశ్వసిస్తున్నాం.