పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. పునీతుల్లాగే

ప్రభూ! పునీతుల్లాగే మేమగూడ నిత్యానిత్యవస్తు వ్యత్యాసాన్ని గ్రహింతుముగాక. వారిలాగే మేముకూడ చిన్నవాటిలోని గొప్పతనాన్నీ గొప్పవాటిలోని అల్పత్వాన్నీ అర్థంజేసికొందుముగాక. నరులు సంతోషించే సంఘటనల్లో వుండే దుఃఖాన్నీ దుఃఖించే సంఘటనల్లో వుండే సంతోషాన్నీ అర్థంజేసి కొందుముగాక. వారిలాగే మేముకూడ మా జీవిత ధ్యేయానివి నీవేననీ, మేము ప్రేమింపదగినవాడవు నీవొక్కడవేననీ, అసలు మాకు జీవిండచడమంటే నీ జీవితాన్ని జీవించడమేనని గ్రహింతుముగాక, ఓ ప్రభూ! నీవు నీయంతటివాడివి కనుక నిన్ను స్తుతిస్తున్నాం. నీ కొరకే నిన్ను స్తుతిస్తున్నాం. నీ యర్యశిష్ణులను బట్టి నీకు స్తుతి కలుగునుగాక. నీవు వాళ్లకు చేసిన మేళ్ళకుగాను నీకు వినుతి కలుగునుగాక. నీవు సృజించిన ప్రాణికోటి అంతా నిన్నుస్తుతించునుగాక. నీకే సదా మహిమ కలుగునుగాక.

9. తండ్రీ! నీ చేతుల్లోనికి

తండ్రీ ! నన్ను నేను నీ చేతుల్లోనికి అర్పించుకొంటున్నాను. నన్ను నీ యిష్ట మొచ్చినట్లు చేయి. నీవు నన్ను ఏమి చేసినా నేను నీకు వందనాలు అర్పిస్తాను. నేను అన్నిటికీ సిద్ధమే, అన్నీ అంగీకరిస్తాను. నా జీవితంలోను సకల నరుల జీవితంలోను నీ చిత్తం నెరవేరునుగాక. ఇంతకంటే నేను కోరుకొనేదేమీ లేదు. ప్రభూ! నేను నిన్నుపూర్ణంగా ప్రేమిస్తున్నాను. కనుకనే నన్ను నేను నీ కర్పించుకోగోరుతున్నాను. ఏమీ దాచుకోకుండ నన్ను నేను సంపూర్ణంగా నీకర్పించుకొంటున్నాను. నీవు నాకు తండ్రివి కనుక నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను.

10. శ్రీసభ కొరకు

కరుణగల తండ్రీ పవిత్రమైన తిరుసభ కొరకు నీకు ప్రార్థన చేస్తున్నాం. ఆ సభను నీ సత్యంతో నింపు. నీ శాంతితో కాపాడు. దాని లోపాలను నీవే సంస్కరించు. దాని తప్పలను నీవే సవరించు. దాని హక్కులను నీవే నిలబెట్టు. దాని అవసరాలను నీవే తీర్చు అది విభజనకు గురైనపుడు నీవేదాన్ని ఐక్యపరచు. నీ యాత్మబలంతో దాన్ని నడిపించు. మా రక్షకుడూ నీకుమారుడూ ఐన క్రీస్తుద్వారా ఈ మనవులన్నీ ఆలించు.