పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రార్థనకూడ సుకుమారమైంది. అది మన హృదయాల్లో వర్ధిల్లాలంటే మనం మౌనాన్నీ ఏకాంతాన్నీ పాటించాలి. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. నియమితకాలంలో జపం చేసికోవాలి. లేకపోతే మన హృదయంలో ప్రార్ధనం నిల్వదు. చచ్చిపోతుంది. కనుక మనం ప్రార్థన అనే మొక్కను జాగ్రత్తగా పెంచుకోవాలి.

ప్రార్థనకు దేహం, ఆసనం, స్థలం, కాలాన్ని వెచ్చించడం, దేవునిమీద కోర్కె పెట్టుకోవడం మొదలైన సహాయకారులు వున్నాయి. వీటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. దేహం

జపానికి దేహం అతిముఖ్యమైన సహాయకారి, కలెక్టరు, గవర్నరు మొదలైన పెద్ద అధికారులను కలసికొన్నపుడు వారి యెదుట మేరమర్యాదలతో నిలబడతాయి. కాని అధికారులందరికి అధికారి దేవుడు, ప్రార్ధనం చేసేపుడు అతని ముందట వుంటాం. కనుక ప్రార్థనలో మన దేహాన్ని మేరమర్యాదలతోను భక్తితోను వుంచుకోవాలి. ఈ వెలుపలిభక్తి లోపలి ఆత్మమీద కూడ సోకుతుంది. దేహంలో భక్తిలేకపోతే లోపలి ఆత్మలోకూడ భక్తి వుండదు.

మనం కేవలం నోటితోనే మాట్లాడం. దేహంతో గూడ సంభాషిస్తాం. మన చేతులు, కాళ్లు ముఖం మొదలైన అవయవాలన్నీమాటలాడతాయి. ఆలాగే మనం కేవలం ఆత్మతో మాత్రమే ప్రార్ధనం చేయం. దేహంతో గూడ చేస్తాం. ఉదాహరణకు దేవునికి చేయెత్తి దండం పెడతాం. అతని ముందు చేతులు జోడించుకొని నిలబడతాం, ఆ ప్రభువు వైపు ఆశతో చూస్తాం. మన ముఖంలో భక్తినీ వినయాన్నీ దీనత్వాన్నీ ప్రదర్శిస్తాం. ఆ మహాప్రభువుముందు సాష్టాంగపడతాం. ప్రార్థనలో ఈ దేహసంజ్ఞలన్నీ వాడుకోవాలి. కేవలం మనసుతోనేగాక శరీరంతో గూడ ప్రార్ధనం చేయడం అలవాటు చేసికోవాలి.

2. ఆసనం

మూమూలుగా మనం మోకాళ్ళూనో, కూర్చుండో, నిల్చుండో, మెల్లగా అటూ యిటూ తిరుగుతూనో జపంజేస్తాం. ఈ దేహభంగిమలే ఆసనాలు. కొందరికి మోకాళ్ళ మీద వుంటే బాగా భక్తి పడుతుంది. కొందరికి స్తిమితంగా కూర్చుంటే భక్తిపడుతుంది. అభ్యాసంకొద్దీ అనుభవం కొద్దీ ప్రార్థనలో ఏయాసనం మనకు బాగా వుపయోగపడుతుందో మనం గుర్తించే వుంటాం. మనకు బాగా వుపయోగపడే ఆసనాన్నే మనం ప్రార్థనలో వాడుకోవాలి. దాన్ని అనవసరంగా మార్చకూడదు. మారిస్తే ప్రార్ధనం చెడిపోతుంది. మన ఆసనం మేరమర్యాదలనూ వినయాన్నీ సూచించాలి.