పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వభక్తులకున్న విశ్వాసం నేడు మనకు లేదు. ఫ్రాన్సిస్, అంతోని మొదలైన భక్తులు దేవుణ్ణి నమ్మి ప్రార్థన చేసారు. వాళ్ళ నమ్మినట్లుగానే దేవుడు వాళ్లు అడిగింది దయచేసాడు. ఈ విశ్వాసం నేటి ప్రజలకులేదు. కనుక మనం ఈ గుణాన్ని ఆవశ్యం పెంపొందించుకోవాలి.

సువిశేషంలో ఓ సంఘటనం విన్పిస్తుంది. ఓ కుర్రవాడికి మూగదయ్యం పట్టింది. అది పిల్లవాణ్ణి నేలపై పడవేసి కొయ్యబారిపోయేలాగ చేసేది. పిల్లవాడి తండ్రి ఆ బాలుణ్ణి శిష్యులవద్దకు తీసికొని వచ్చాడు. కాని శిష్యులు ఆ భూతాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అటుతర్వాత తండ్రి ఆ బాలుణ్ణి క్రీస్తు దగ్గరికి తీసికొనివచ్చి అయ్యా! నీకు సాధ్యమైతే ఈ దయ్యాన్నివెళ్ళగొట్ట అని మనవిచేసాడు. క్రీస్తు నీవు నమ్మితేచాలు, నమ్మినవాళ్ళకు అంతా సాధ్యమే అన్నాడు. ఆ తండ్రి నేను నమ్ముతూనేవున్నాను. నేను అవిశ్వాసం చెందకుండేలా నీవే నాకు సాయంచేయి అన్నాడు. ప్రభువు అతన్ని కరుణించి అతని కుమారుని నుండి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు - మార్కు 9, 17-24. ఈ తండ్రి మనకు ఆదర్శంగా వుంటాడు. కనుక మన తరపున మనం ఈలా జపించాలి. "ప్రభూ! నేను నిన్నూనీ శక్తినీ నమ్ముతూనే వున్నాను. ఈ విపత్తులో నీవు నాకు సహాయం చేస్తావని విశ్వసిస్తున్నాను. నా విశ్వాసంలో ఏమైనా కొరతవుంటే నీవే దాన్ని భర్తీచేయి".

మన మనవిజపం ఫలించకపోవడానికి రెండవ కారణం మనం శత్రువులను క్షమించకపోవడం, దీన్ని గూర్చి విపులంగా పరిశీలిద్దాం.

2. విరోధులను క్షమించడం

క్రీస్తు ఈలా బోధించాడు. "నీవు ప్రార్థించేపుడు నీ సోదరునిపై నీకేమన్నా మనస్పర్థవంటే వానిని క్షమించు. అప్పడు పరలోకంలోని మీ తండ్రి మీ తప్పిదాలనుగూడా మన్నిస్తాడు” - మార్కు 11, 25-26, అనగా మనం ఇరుగుపొరుగువారి పాపాలను మన్నించందే దేవుడు మన పాపాలను మన్నించడు. మన ప్రార్థన ఆలించడు.

మరో సందర్భంలో ప్రభువు ఈలా నుడివాడు. "నీవు నీ కానుకలను బలిపీఠం దగ్గరికి తెచ్చావనుకో. అప్పుడు నీ పొరుగువానికీ నీకూ స్పర్థలు వున్నాయని నీకు తడుతుంది. అలాంటి పరిస్థితిలో నీ కానుకను అక్కడే వదలివేయి. మొదట వెళ్ళి నీ పొరుగువానితో రాజీపడిరా, తర్వాత తిరిగివచ్చి కానుకను సమర్పించుకోవచ్చు” - మత్త 5,23-24 అనగా దేవుణ్ణి పూజించడంకంటె తోడివారిపట్ల ప్రేమతో మెలగడం ముఖ్యమని భావం. దైవప్రేమకంటె సోదరప్రేమ ఘనమైనదని అర్థం.

మనందరిలోను ద్వేషభావాలు గూడగట్టుకొని వుంటాయి. ఈ ద్వేషాన్ని బయటికి కన్పించనీయం. కాని హృదయంలో మాత్రం ఎంతో పగ పేరుకొని వుంటుంది. చాలమంది