పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆందోళనం చెందకూడదని మాత్రమే పర్యవసానం. దేవుణ్ణి అడుగుకోనక్కర్లేదని పర్యవసానం కాదు - మత్త 6, 25-88. మనం దేవుణ్ణి అడుగుకొనేది మన అవసరాలు అతనికి తెలియవని కాదు. అతని ముందు మన వినయాన్ని ప్రదర్శించుకోవడానికి, అతడు అనుగ్రహించందే మనం బ్రతకలేమని తెల్చుకోవడానికి, అతని వరాలను పొందడానికి మనలను మనం సిద్ధం జేసికోవడానికి - అంతే.

ఓ వుదాహరణం తీసికొందాం. పంట మిక్కుటంగా వుంది. కాని కోతగాండ్రు తక్కువగా వున్నారు. కనుక పంటను సేకరించడానికి కోతగాండ్రను పంపవలసిందని పంట యజమానునికి మనవి చేయండి అని ఆదేశించాడు క్రీస్తు — మత్త 9, 37-38. ఇక్కడ పంట దేవునిదే కదా? మనం ప్రార్ధించకపోయినా దాన్ని సేకరించడానికి దేవుడు పనివాళ్ళను పంపుతాడు గదా? మరి మనం ప్రార్ధించడం దేనికి? దేవుడు రక్షణకార్యంలో మన సహకారాన్ని గూడ అర్ధిస్తాడు. కనుక మన ప్రార్ధనం కూడ అవసరం.

ట్రెంటు మహాసభ ఈలా బోధించింది. “దేవుడు మనలను అసాధ్యమైన పనులు చేయమని ఆజ్ఞాపించడు. సాధ్యమైన పనులను చేయమనే ఆజ్ఞాపిస్తాడు. అసాధ్యమైన పనులు తగిలినపుడు తన సహాయం అడుగుకోమని ఆజ్ఞాపిస్తాడు". ఈ దైవసహాయం కొరకే మనం మనవి ప్రార్ధనం చేసేది. మనం పాపాలన్ని విసర్జించి పుణ్యజీవితం గడపాలంటే వరప్రసాదం అవసరం. మనం మంచిని చేసినపుడెల్ల దేవుడే మనతో వుండి ఆ మంచి పనిని చేయిస్తున్నాడు. భక్తిమంతులు కూడ మరణం వరకు నిర్మలజీవితం గడపాలంటే వరప్రసాదం అవసరం. అది లేoదే యెవడూ పుణ్యాజీవితంలో నిలకడగా వుండలేడు. మన యీ భూలోక జీవితం యెడారిలాంటిది. దేవుడు మనపై వరప్రసాద జలాన్ని వర్షించందే మనం పుణ్యజీవితంలో కొనసాగలేం. ఈ వరప్రసాద జలాన్ని పొందడం కొరకే మనం మనవి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన చేయమని క్రీస్తు పలుసార్లు శిష్యులను ఆదేశించాడు కూడ.

బైబులు ఉపమానంతో చెప్పాలంటే బిడ్డడు తల్లిదండ్రులమీద ఆధారపడినట్లే మన అవసరాల్లో మనం దేవుని మీద ఆధారపడాలి. అతన్ని అడుగుకోవాలి, తల్లిదండ్రులు బిడ్డడికి సాయం జేసినట్లే దేవుడు మనకు సాయం జేస్తాడు. బిడ్డడు తన అవసరాలను తానే తీర్చుకోనక్కరలేదు. ఆందోళనం చెందనక్కరలేదు. అతనికి సాయం జేయడానికి తల్లిదండ్రులున్నారు. ఈలాగే మనకు సాయం జేయడానికి దేవుడున్నాడు.

అడగందే అమ్మయినా పెట్టదు అని తెలుగు సామెత. మనం దేవుణ్ణి అడగకుండా మెదలకుండా కూర్చుంటే అతడు మనకు తోడ్పడడు, అతడు మన సోమరితనాన్ని గర్షిస్తాడు. మన కృషిని మెచ్చుకొంటాడు. కనుక మనం దేవుడ్డి అడుగుకోవాలి. వేదశాస్తులు ఏమి