పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈలా అన్నాడు. మిరీలా ప్రార్ధించండి. తండ్రీ నీ నామం పవిత్రపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక" - లూకా 11,2.

క్రీస్తు బోధ ప్రకారం, ప్రార్ధనం మన అవసరాలతో ప్రారంభంకాదు, దైవస్తుతితో ప్రారంభమౌతుంది. మనం మన అవసరాలకంటె ముందుగా దైవరాజ్యాన్ని గూర్చి తలంచాలి. కనుకనే ప్రభువు "మొదట దైవరాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పడు అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి" అని చెప్పాడు - మత్త 6, 33.

క్రీస్తు ప్రార్థనా అతని జీవితమూ కూడ తండ్రి మీదనే లగ్నమై యుండేవి. క్రీస్తు ప్రధానంగా ఇతరుల కొరకు జీవించినవాడు. విశేషంగా తండ్రి కొరకు జీవించినవాడు, సువిశేషాలను పరిశీలిస్తే అతడు ప్రధానంగా నరుల కొరకుగాక తండ్రి కొరకు జీవించాడని స్పష్టమౌతుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమూ అతని పనిని పూర్తిచేయడమూ క్రీస్తుకి ఆహారం. తండ్రిపని సిలువ మరణమే - యోహా 4,34. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు అతనికి సోదరుడు సోదరి తల్లిలాంటివాళ్లు అవుతారు - మత్త 12, 50. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే క్రీస్తుని ప్రభూ ప్రభూ అని పిలిస్తే చాలదు. తండ్రి చిత్తాన్ని పాటించాలి - మత్త 7, 21. క్రీస్తు మనపైగల ప్రేమచేతనే సిలువపై మరణించాడు. కాని అంతకంటే ముఖ్యంగా తండ్రి ఆజ్ఞకు బద్దుడై సిలువపై మరణించాడు. కనుకనే అతడు తండ్రిని ఉద్దేశించి నా యిష్టంగాదు. నీ యిష్ట ప్రకారమే జరగనీయి అని ప్రార్థించాడు - మార్కు 14, 36. ఈ వేద వాక్యాలనుబట్టి మనం ఓ సంగతిని అర్థంజేసికోవాలి. క్రీస్తు ఉద్దేశం ప్రకారం ప్రార్ధనం ఎప్పడు కూడ తండ్రితో ప్రారంభమౌతుంది. ఆ తండ్రి రాజ్యం, అతని స్తుతి, అతని చిత్తం నెరవేరడం - వీటితో మనం ప్రార్థనను ప్రారంభించాలి. మన అవసరాలకంటె ముందుగా ఈ విషయాలు రావాలి. మనకంటె ముందు దేవుడు ముఖ్యం గదా!

ఐతే, మన అవసరాల మాట యేమిటి? దేవుణ్ణి స్తుతించాక మన అవసరాలు కూడ ఆ ప్రభువుకి విన్నవించుకోవాలి. కనుకనే పరలోక జపంలోని రెండవ భాగంలో ప్రభువుని మన అవసరాలు తీర్చమని అడుగుకొంటున్నాం. "మా అనుదినాహారం మాకు దయచేయండి, మా పాపాలను మన్నించండి, శోధనలనుండి మమ్మ కాపాడండి" అని వేడుకొంటున్నాం - లూకా 11, 3-4. ఈ యవసరాలను దేవుడు కాకపోతే మరెవరు తీరుస్తారు?

3. మనవి జపం ప్రాముఖ్యం

పరలోక జపంలో క్రీస్తు నేర్పింది ముఖ్యంగా మనవిజపమే. మనవి జపమంటే మన అవసరాలను తీర్చమని దేవుణ్ణి అడుగుకోవడం. మనం తండ్రీ! నీ నామం పవిత్ర