పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ దైవవ్యక్తులతోపాటు అన్ని వరాలనూ మాకు దయచేస్తావు
నిన్ను ఆదర్శంగా పెట్టుకొని మేముకూడ
ఈయడం నేర్చుకోవాలి
ఎప్పుడుకూడ తీసికొనేవాడికంటె ఇచ్చేవాడు ధన్యుడు
కావననే తోడి నరునికి గ్రుక్కెడు మంచినీళ్ళిచ్చినా
ప్రతిఫలం తప్పక లభిస్తుందన్నాడు క్రీస్తు
ఇంకా అతడు స్వయంగా ప్రాణత్యాగంచేసి
తోడివారి కెంత ప్రియమైన వస్తువు నీయవలసి వచ్చినాసరే
వెనుకాడగూడదని మాకు పాఠం నేర్పాడు
మా తరపున మేము మా ప్రాణాల నీయలేకపోయినా
మాకున్నది తులమోఫలమో అన్యులతో పంచుకోవాలి
లేకపోతే మేమేమి శిష్యులం?
ఒకోమారు కొద్దోగొప్పో యిస్తాంగాని
మా దానాన్ని గూర్చి బాగా ప్రకటనం చేయించుకొంటాం
ఆడంబర ప్రియులమైన మాకు ఇదొక సంతృప్తి
"కుడిచేతి దానం ఎడమచేతికి తెలియకూడదు
దేవుడు ఒక్కడు మన దానం గుర్తిస్తేచాలు" అన్న క్రీస్తవాక్యం
స్వార్థపరులమైన మాకు సిగ్గునే పట్టిస్తుంది
ఏమైతేనేమి, నిన్నూ క్రీస్తనీ ఆదర్శంగా పెట్టుకొని
మేము కూడ ఈయడమనే కష్టమైన విద్యను నేర్చుకోవాలి
నీళ్లు తీస్తూంటే యింకా వూరుతుంది చెలమ
తీయకపోతే ఉన్న నీళ్లుకూడ తెప్పకట్టి చెడిపోతాయి
మా జీవితానికీ ఇదే సూత్రం వర్తిస్తుందని గుర్తించే భాగ్యం
నీ దాసులమైన మా కందరికీ దయచేయి.

53. అసూయ

ఆది 30,1-2. 37,3-4. 1సమూ 18,6-9. లూకా 9,49-50.

ప్రభూ! నేను ఇతరులు కొంచెం పచ్చగావుంటే ఓర్వలేను
సులభంగా అసూయకుగురై నా యల్పత్వాన్ని చాటుకొంటాను
ఇతరుల నెవరైనా కొంచెం పొగడితే సహించలేను
అన్యులు నాకంటె కొంచెం మంచి బట్టలు ధరిస్తే ఓర్వలేను
పరులు లాభాన్ని నా నష్టంగా భావించి బాధపడతాను
ఇతరుల నష్టాన్ని నా లాభంగా యెంచి పొంగిపోతానుగూడ
ఇంతకంటె నీచప్రవృత్తి మరొకటుంటుందా?