పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

31. దివ్య వైద్యుడు

మత్తయి 8, 17. మార్కు 3,1-6

ప్రభూ! నీవు మా వ్యాధిబాధలను జూచి జాలిచెందావు
ప్రజలు నీయొద్దకు రోగులను తీసికొనిరాగా
నీవు కరుణతో వారిమిద చేతులుచాచి
వారి వ్యాధులను నయంజేసావు
కనుకనే “అతడు మన వ్యాధులను భరించాడు
మన బాధలను తన భుజాలమిద వహించాడు"
అని యెషయా నిన్ను గూర్చి ప్రవచించాడు
నరులు పనిచేయగూడని విశ్రాంతిదినాన గూడ
నీవు రోగులను పరామర్శించావు
బాధతో అలమటించే నరుణ్ణి ఆదుకోవడానికి
విశ్రాంతిదినం అడ్డగా పరిణమించగూడదని నుడివావు
విశ్రాంతిదినం నరుల కొరకుగాని
నరులు విశ్రాంతిదినం కొరకుగాదు అని విశదీకరించి
నిన్నెదిరించిన యూదనాయకుల నోళ్లు మూయించావు
జబ్బులతో అల్లాడిపోయే ప్రజాసమూహానికి
అమృతహస్తాలతో ఆరోగ్యదానం జేసిన వైద్యుడివి నీవు
కనుక రోగపీడితులూ బాధామయులూ,
అపార్గాలకూ అన్యాయాలకూ గురైనవాళ్ళూ,
ఒంటరితనంవల్లా నిరుత్సాహంవల్లా క్రుంగిపోయేవాళ్లూ,
బంధునష్టంవల్లా వియోగంవల్లా పరితపించేవాళ్ళూ,
పేదరికం తెచ్చిపెట్టే ఆకలిదప్పలవల్ల కృశించేవాళ్ళూ
మొదలైన నానావిధ దుఃఖార్తల నందరినీ కరుణించు
ఆనాడు సిలువమిద నీవనుభవించిన బాధలద్వారా
నేటి మా వేదనలన్నిటికీ ఉపశాంతిని దయచేయి
పైగా తోడిప్రాణి యాతనలను జూచి
జాలిచెందే మెత్తని గుండెనుగూడ మాకు ప్రసాదించు.