పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనుక నేను సమస్త వస్తువుల్లోను నిన్ను గుర్తించేలా చేయి
సమస్త వస్తువులనూ నీయందు గుర్తించేలా అనుగ్రహించు
నీ ముఖప్రకాశంతో నన్ను వెలిగించు
నా యెదలోని చీకట్లను తొలగించు
నిన్ను జేరి నీసన్నిధిలో వుండిపోవడం జీవం
జీవనాధారానివైన నీనుండి వైదొలగడం మరణం.

20. దత్తపుత్రులు

రోమా 8,15-17. యోహా 6,44, 14,4

తండ్రీ! క్రీస్తు నీకు సరిసమానుడు, సహజపుత్రుడు
ఆ పుత్రునిలోనికి జ్ఞానస్నానం పొంది
మేము నీకు దత్తపుత్రీ పుత్రుల మౌతాం
అతని ద్వారా నిన్ను చనువుతో నాన్నా అని పిలుస్తాం
పూర్వవేద ప్రజలు నిన్నుజూచి భయపడ్డారు
నీ పేరు ఉచ్చరించడానికి జంకి నిన్ను అదొనాయి అని పిల్చారు
నీవు యజమానుడవనీ తాము నీకు బానిసలమనీ యెంచారు
కాని నూత్నవేదంలో క్రీస్తు చలవవల్ల
మేము నిన్ను స్వాతంత్ర్యంతో నాన్నా అని పిలువగల్లుతున్నాం
లోకంలోని నరులంతా సృష్టిద్వారా నీ బిడ్డలయ్యారు
ఎన్నిక నిబంధనలద్వారా యూదులు సుతులయ్యారు
కాని మేము క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది
నీ సంతాన మయ్యాం
సకలలోకాలకు కర్తవూ దేవాధిదేవుడూ ఐన నిన్ను
గారాబు తండ్రినిగా బొందడం సామాన్యభాగ్యమా?
లోకంలో ఉన్నతాధికారి కుమారుడు
తన తండ్రిని జూచి గర్విస్తాడు
తండ్రులందరికి తండ్రివి అధికారులందరికి అధికారివి నీవు
నీ తనయుల మైనందుకు మేమైంతగా గర్వించాలి?
మేము నీ బిడ్డలంగాన నీవు మమ్మెంతగానో ప్రేమిస్తావు