పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీవు నా ముందూ నా వెనుకాగూడ పయనిస్తూంటావు
ప్రేమతో నిరంతరం నన్నాదుకొంటూంటావు.
నన్ను గూర్చిన నీ తెలివిడి ఆశ్చర్యకరమైంది
అల్పబుద్ధినైన నేను దాన్ని గ్రహించలేనుగూడ

నీ సమక్షంనుండి తప్పించుకొని నే నెక్కడికి పారిపోగలను?
నేను గగనాని కెక్కిపోతే నీ వక్కడుంటావు
పాతాళానికి దిగిపోతే అక్కడుంటావు
రెక్కలు కట్టుకొని తూర్పుదిక్కున కెగిరిపోతే,
పడమరన చాల దూరంవరకు పయనిస్తే, అక్కడా వుంటావు
నేను చీకటిలో దాగుకొన్నా నీ కంట బడకపోను
చీకటి నీ ముందు పగటిలా ప్రకాశిస్తుంది
రేయింబవళ్ళు నీకు సరిసమానం

నాలోని ప్రత్యణువునూ నీవే సృజించావు
మాతృగర్భంలో నన్ను రూపొందించింది నీవే
నేను తల్లికడుపులో పిండాకృతిపొంది
వివిధాంగాలతో చిత్రంగా రూపొందుతూన్నపుడే,
ఇంకా యే నరుడూ నన్ను కంటితో చూడకమునుపే,
నీవు నన్ను ప్రేమతో వీక్షించావు
నీవు నాకు నిర్ణయించిన దినాలన్నిటినీ,
వాటిని నేనింకా జీవింపకమునుపే,
ముందుగానే నీ గ్రంథంలో లిఖించి వుంచావు
నా జీవితంలోని ప్రత్యంశమూ నీకు ముందుగానే తెలుసు
నాపట్ల నీకు గల ప్రేమభావాలు అన్నీ యిన్నీ కాదు
అవి యిసుక రేణువుల్లాగ లెక్కల కందవు

తండ్రీ! ఈలా నీవు నన్ను నిరంతరం అనురాగంతో స్మరిస్తున్నా
లోకవ్యామోహాల్లో చిక్కుకొని నేను నిన్ను విస్మరిస్తుంటాను
మబ్బు చంద్రబింబాన్ని లాగే
నేనింతగా అభిమానించే యీ సృష్టివస్తువులు
నిన్ను కప్పివేస్తుంటాయి