పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. వస్తు వ్యామోహం లూకా 12,16-21. మత్త 6,24

 >క్రీస్తూ! నీవు ఇద్దరు యజమానులను సేవించవద్దన్నావు
దేవునికీ లోకవస్తువులకీ సేవలు చేయవద్దన్నావు
ఈ సత్యాన్ని బోధించడానికే ధనవంతుని కథ కూడ చెప్పావు
సంపన్నునికి సమృద్ధిగా పంటలు పండాయి
అతడా ధాన్యాన్ని పెద్దకొట్లలో నిల్వజేయించి
దీర్ఘకాలం తింటూ త్రాగుతూ సుఖిస్తాననుకొన్నాడు
దేవుడ్డీ తోడినరుణ్ణీ ఏమాత్రం పట్టించుకోననుకొన్నాడు
కాని ఆరాత్రే దేవుడు అతని ప్రాణాలు తీయగా
బంధువులు వచ్చి వాని యాస్తిపాస్తులు పంచుకొనిపోయారు
ఐహికవస్తువుల కంటిపెట్టుకొని దేవుణ్ణి విస్మరిస్తే
ఎవరికైనా ఈలాంటి దుర్గతే పడుతుంది
మా పాపాలన్నిటికీ మూలకారణం ఈ వస్తువ్యామోహమే
నీవు చేసిన సృష్టివస్తువులు మమ్మ మభ్యపెడతాయి
మే మా వస్తుజాలంలో చిక్కుకొని నిన్ను విస్మరిస్తాం
నరుడు సృష్టివస్తువులను వాడుకొని నిన్ను చేరాలి
నీవద్ద కెక్కిరావడానికి అవి నిచ్చెనమెట్లలా వుపకరిస్తాయి
కాని మా దౌర్భాగ్యమేమిటంటే
మేము ఈ నిచ్చెన మెట్లమిూదనే కూర్చోగోరుతాం
వాటిని దాటి నీ చెంతకు రావడానికి ఒప్పకోం
సృష్టివస్తువులంటే మాకు అంత ప్రీతి
వాటి చెంతకు లగెత్తడమంటే అంత సరదా
కనుకనే వాటి ననుభవిస్తూ నిన్ను మరచిపోతాం
కాని భక్తుడు అగస్టీను అనుభవపూర్వకంగా చెప్పినట్టు
నీవు మా హృదయాలను సృష్టివస్తువుల కొరకు గాక
అన్నియానందాల కావలి యానందమైన నీకొరకే చేసావు
కనుక నీయందు విశ్రమించిందాకా
మా హృదయాలకు విశ్రాంతి అంటూ లేదు

209