పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తరపున మనవి చేసేవాడు. మన పాపాలకూ సర్వలోక పాపాలకూ శాంతికరుడు ఆ ప్రభువే అనగా అతని సిలువ మరణం మన పాపాలను శుద్ధిచేస్తుంది. కనుక ఆ ప్రభువు మన దోషాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనకు విముక్తి గలిగిస్తాడు.

ఇక, మనం పాపం లేని వాళ్ళం అనుకొంటే హతమైపోతాం. మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. అబద్దమాడతాం. నరుల పాపాల కోసం చనిపోయానని చెప్పే క్రీస్తుని గూడ అబద్దీకుని జేస్తాం. అంచేత బైబులు క్రైస్తవుడు నిత్యం పశ్చాత్తాపమార్గాన నడుసూండాలి - 16యోహా 1, 8–2,2.

26. నిరపరాధుని రక్తం అప్పగించాను - మత్త 27, 4.

యూదా ఘటోరకార్యం చేసాడు. నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించి పాపం చేసానని ఒప్పకున్నాడు. ఐనా అతనికి పరిహారం లభించలేదు. ఎందుకంటే అతని హృదయం పశ్చాత్తాప తప్తం కాలేదు. పైగా నిరుత్సాహంతో నిండిపోయింది. కనుకనే అతడు ఊరి వెలుపలకు వెళ్లి ఉరివేసుకున్నాడు. కావున పశ్చాత్తాపములేని పాపపు ఒప్పకోలు వల్ల ప్రయోజనం లేదు. పేత్రూ పాపం చేసాడు. ఐనా పశ్చాత్తాప పడి తన పాపాన్ని ఒప్పకున్నాడు, వెలుపలకు వెళ్ళి బోరున యేడ్చాడు. నిరాశ చెందకుండ ప్రభువునందు నమ్మిక వుంచాడు. ప్రభువు అతని పాపాన్ని క్షమించాడు. కనుక పాపం చేసినపుడు నిరాశపడ్డం గాదు, ఎవరో నిర్బంధించగా పాపాన్ని ఒప్పకోవడం గాదు - మరి పశ్చాత్తాప పూరితమైన హృదయంతో ప్రభువు నెదుట - ఆ పాపాన్ని నివేదించుకోవాలి. అప్పడు క్షమాపణం లభిస్తుంది.

27. కేవలం నీకే విరోధంగా - కీర్త 51.4

పశ్చాత్తాప ప్రార్థనలోని ముఖ్యాంశం పశ్చాత్తాపమే. ఎంతగా పశ్చాత్తాప పడతామో అంతగా పాపపరిహారం పొందుతాం. మనం చేసే ప్రతి పాపమూ భగవంతునికి ప్రతికూలంగా పోతుంది. పాపంలోని సారమూ దుష్టత్వమూ, ఈ భగవంతునికి వ్యతిరేకంగా పోవడమనే అంశంలోనే యిమిడివుంది. అందుకే కీర్తినకారుడు స్వీయ పాపాన్ని స్మరించుకొని, "నీకే, కేవలం నీకే విరోధంగా పాపం చేసాను ప్రభూ" అన్నాడు. ఈ సత్యాన్ని మనం బాగా జీర్ణంచేసికోవాలి. కొంతమంది మంచినీళ్లు త్రాగినంత సులభంగా చీటికి మాటికి పాపం చేస్తుంటారు. పాపం భగవంతునికి విరోధంగా పోతుందని అర్థం చేసికున్నవాళ్లు ఇంత చులకనగా పాపకార్యాలకు పూనుకోరు.