పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6.మేము చేయవలసినంత సేవ చేయలేదు. మంచిని చేయడానికి నీవు మా కిచ్చిన అవకాశాలను వినియోగించుకోలేదు.

7.మేము చేయవలసిన పనులను సరిగా చేయలేదు. చాలసార్లు వంచనతో మా బాధ్యతలనుండి తప్పకొన్నాం.

8.నీవు మాకు దయచేసిన స్వేచ్చను దుర్వినియోగం చేసికొని విచ్చలవడిగా ప్రవర్తించాం. అదుపుతప్పి తిరిగాం.

9.మేము ఒకటి తలంచి ఇంకొకటి చెప్పాం. ఒకటి చెప్పి మరొకటి చేసాం, మా ప్రవర్తనంలో చిత్తశుద్ధి లోపించింది.

10.మేము డబ్బును దూబరాగా ఖర్చుచేసాం. ఆయావస్తువులను అజాగ్రత్తగా వాడి పాడుచేసాం. కాలాన్ని వ్యర్థం చేసాం.

11.మేము మా దేహాలను పవిత్రమైన చూపుతో చూడలేదు. ఇతరుల దేహాలను కామదృష్టితో చూచాం.

12.లైంగిక విషయాలను గూర్చిన ప్రస్తావనం వచ్చినపుడు అపవిత్రమైన తలంపులు తలంచాం, అసభ్యమైన మాటలు మాటలాడాం.

13.అన్యలింగ వ్యక్తులతో మెలిగేప్పడు పాడుచూపులు చూచాం, పాడుకోరికలు కోరాం,

14.మా సంభాషణల్లో ఇతరుల మంచిపేరును చెడగొట్టాం. మాకు గౌరవం వస్తుందనుకొని ఇతరులను తూలనాడాం.

15.మా నడవడికలో గర్వమూ మిడిసిపాటూ ప్రదర్శించాం. మేము స్నేహశీలంగాను మృదువుగాను ప్రవర్తించలేదు.

16.మా చదువుల్లో శ్రద్ధ చూపలేదు. చిత్తశుద్ధితో పరీక్షలకు సిద్ధం కాలేదు.

17.మా వుపాధ్యాయులపట్ల గౌరవం చూపలేదు. వాళ్లు ఇచ్చిన పనిని తృప్తికరంగా చేయలేదు.

18. పెద్దలు మా కోర్కెలు తీర్చనపుడు మొగం చిట్టించుకొన్నాం. వాళ్ళతో సహకరించక వాళ్ళ మనసు కష్టపెట్టాం.

19.స్వార్థబుద్ధితో మా సుఖాన్ని మేము చూచుకొన్నాం. పేదసాదలు కూడూగుడ్డా లేక అలమటిస్తుంటే వాళ్ళను పట్టించుకోలేదు.

20.మేము సామాజిక స్పృహ నలవర్చుకోలేదు. సమాజంలో పేదలకు జరిగే అన్యాయాలను అవగాహనం చేసికోలేదు.