పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటలో అతనికి విశ్వాసముంది. కనుక కొంతదూరం బాగానే నడచాడు. అంతలో పెనుగాలికి అతని విశ్వాసం చలించింది. మునిగిపోబోయాడు. మల్లా విశ్వాసం తెచ్చుకొని ప్రభూ నన్ను రక్షించు అని కేకలు వేసాడు. క్రీస్తు అతన్ని మునగనీయకుండా పట్టుకొని పడవలోకి చేర్చాడు. ఇక్కడ పేత్రులో నమ్మకమూ, సందేహమూ, మళ్లా నమ్మకమూ అనే మూడంశాలు గుర్తించాలి. కనుకనే ప్రభువు అతన్ని అల్పవిశ్వాసి అన్నాడు. ఈ పేత్రులాగే మనంకూడ కొంతకాలం భక్తిగా జీవిస్తాం. కాని తర్వాత ఆ భక్తిని కోల్పోయి పాపంలో పడిపోతాం. మల్లా పశ్చాత్తాపపడి దారికి వస్తాం. మల్లా అపమార్గం పడతాం, ఈలా జీవితకాలమంతా పడుతూ లేస్తూ వుంటాం. కనుక మన విశ్వాసాన్నీ భక్తినీ పెంచమని ప్రభువుని నిరంతరం అడుగుకోవాలి.

37. నా అవిశ్వాసాన్ని నీవే తొలగించు – మార్కు9,24

ఒక తండ్రి మూగదయ్యం పట్టిన కుమారుడ్డి శిష్యుల వద్దకు తీసికొని వచ్చాడు. కాని వాళ్లు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేక పోయారు. తర్వాత ఆ తండ్రి కుమారుడ్డి క్రీస్తు దగ్గరికి కొనివచ్చి నీకు సాధ్యమైతే నాకు సహాయం చేయమని అడిగాడు. క్రీస్తు నీవు విశ్వసిస్తే చాలు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టవచ్చు అన్నాడు. ఆ తండ్రి వినయంతో అయ్యా! నేను నీ శక్తిని నమ్ముతూనే వున్నాను. నాలో ఏమైనా అవిశ్వాసం వుంటే దాన్ని నీవే తొలగించు అని వేడుకొన్నాడు. తర్వాత క్రీస్తు ఆ బాలునినుండి మూగ దయ్యాన్ని పారదోలాడు. ఇక్కడ "నా అవిశ్వాసాన్ని తొలగించు" అని ఈ తండ్రి చేసిన మనవి చాల మంచి ప్రార్థన. మనకు చాల పర్యాయాలు విశ్వాసం లోపిస్తుంది. దేవుణ్ణి కొంత వరకు నమ్ముతాం. కొంతవరకు నమ్మం, ఏదో భయం, ఆందోళన మనలను ఆవరిస్తుంది. చీకట్లు కమ్మినట్లుగా వుంటుంది. కొన్నిసార్లు అసలు ప్రార్థనే చేయబుద్ధికాదు. ఒకవేళ చేసినా నమ్మకంతో చేయం. ఇదే మన అల్పవిశ్వాసం. మనందరికీ ఈ బలహీనత వుంటుంది. ఈలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని పెంచమని ప్రభువుని అడుగుకోవాలి. క్రైస్తవ జీవితమంతా ఈ విశ్వాసం మీదనే ఆధారపడి వుంటుంది, అది వున్నవాళ్ళ భక్తిగా జీవిస్తారు. దేవుని దగ్గరికి వస్తారు. అది లేనివాళ్ళ దేవునికి దూరంగా వుంటారు.

38. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకముంచుకో — లూకా 23, 40-43

క్రీస్తుతోపాటు ఇద్దరు దొంగలను సిలువవేసారు. వారిలో ఒకడు క్రీస్తుని నమ్మలేదు. అతడు నీవు మెస్సీయావైతే సిలువమీద నుండి దిగిరా, మమ్ముకూడ సిలువనుండి