పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరుడే దేవునికి లొంగాలి. బైబులు భక్తులు నిరంతరమూ దేవునికి లొంగివుంటారు. మనం కూడ ఈ యభ్యాసాన్ని కలిగించుకోవాలి. దేవుని చిత్తప్రకారం జీవించినపుడు గొప్ప మనశ్శాంతి కలుగుతుంది. మన చిత్త ప్రకారం మనం జీవిస్తే మనం చేసేది పాపకార్యలే.

28. దేవా! ఈ పాపిని కనికరించు - లూకా 18, 13

పరిసయుడు సుంకరీ ఇద్దరు దేవాలయానికి ప్రార్థనకు వెళ్లారు. పరిసయుడు గర్వితుడు. అతడు దేవుని ముందు తన్నుతాను పొగడుకున్నాడు. తన పుణ్యకార్యాలు ఏకరువు పెట్టాడు. పొగరుతో నేనీ సుంకరిలాగ దుర్మార్ణుణ్ణికాదు అని చెప్పకొన్నాడు. కాని సుంకరి గుడిలోని పీఠంవైపు, దైవసాన్నిధ్యంవైపు కన్నులెత్తి చూడటానికిగూడ సాహసించలేదు. తన వినయాన్ని ప్రదర్శిస్తూ రొమ్ము బాదుకున్నాడు. తాను నిక్కంగాపాపినని నమ్మాడు. కనుక దేవా! ఈ పాపిని కనికరించు అని వేడుకున్నాడు. వినయంతో, పశ్చాత్తాపంతో గూడిన అతని వేడుదలను దేవుడు ఆలించాడు. పరిసయని పాపాలను మన్నించని దేవుడు సుంకరి పాపాలను మన్నించాడు. మన ప్రార్థనలో వినయం, చిత్తశుద్ధి వండాలి.

29. పరలోకంలోని మీ తండ్రి - 7, 9-11

ప్రార్థనలో దేవుణ్ణి తండ్రిగాను మనలను బిడ్డలనుగాను భావించుకోవాలి. తల్లిదండ్రులు తమ బిడ్డలు ఆకలివేసి రొట్టె, చేప మొదలైన ఆహార వస్తువులు అడిగినపుడు వాటినే యిస్తారు కాని కీడుచేసే రాయి, పాము మొదలైన వస్తువులను ఈయరు. ఇక దేవుడు మన తండ్రుల్లాగ చెడ్డవాడుకాడు. స్వార్థపరుడుకాడు. అతడెప్పుడూ మనకు మేలుచేసే వస్తువులే యిస్తాడు. ఆ తండ్రిని మనం నమ్మాలి. ప్రార్థనలో మనకూ దేవునికీ తండ్రీబిడ్డల సంబంధం వుంటుంది. ఈ సంబంధం మనకు నమ్మకం పుట్టించాలి. దేవుణ్ణి మించిన అమ్మానాన్నలు లేరు అనుకోవాలి.

30. ఇద్దరు ముగ్గురు నా పేరిట - మత్త 18, 19-20

ఇక్కడ ఇద్దరు ముగ్గురంటే మంది. వ్యక్తి ప్రార్ధన కంటే బృంద ప్రార్ధన బలమైంది. బైబులు భగవంతుడు యిప్రాయేలును ఒక బృందంగా యెన్నుకొన్నాడు. ఆలాగే క్రైస్తవులను కూడ ఒక బృందంగా ఎన్నుకొన్నాడు. మనం అతన్ని ఒక బృందంగానే ఆరాధిస్తాం. బృందంగానే రక్షణం పొందుతాం. కనుక సాధ్యమైనపుడెల్లా బృందంగా ప్రార్ధనం చేసుకోవాలి. వ్యక్తి ప్రార్థన మంచిదే కాని పదిమంది కూడి చేసిన ప్రార్ధన బలంగా వుంటుంది. ఉత్థాన క్రీస్తుపేరిట మనం భక్తసమాజాలుగా రూపొందాలి. ఈ సమాజాలను ఉత్తేజ పరచేది క్రీస్తే.