పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్ను సురక్షితంగా వెలుపలికి తీసికొని వచ్చింది నీవే. మాతృగర్భంనుండి బయటికి వచ్చినప్పటినుండి నేను నీ మీదనే ఆధారపడ్డాను. నీవుదప్ప నాకు ఇంకో దేవుడు లేడు. నీవు తప్ప నన్ను ఆదుకొనేవాడు ఎవడూలేడు. కనుక నన్ను కాపాడు అని వేడుకొన్నాడు. ప్రభువు సిలువమీద వ్రేలాడుతూ ఈ కీర్తనను జపించాడు. ఇది చాల భక్తిగల గీతం. ప్రభువును నమ్మకంతోను దైన్యంతోను వేడుకొంటే అతడు మన మొర ఆలిస్తాడు.

22. కావలివాళ్ళు వేకువజాము కొరకులాగే - కీర్త 130, 5-6

రాత్రంతా కాపలా కాసినవాళ్ళు వేకువజాము కొరకు కాచుకొని వుంటారు. కాసేపు స్తిమితంగా నిద్రపోవాలని కోరుకొంటారు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా పోయి పండుకొందామని చూస్తుంటారు. అలాగే భక్తుడు ప్రభువు సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. అది ఏ క్షణంలోనైనా లభించవచ్చు. దేవుడు దిడీలున తన దాసుని ఆదుకోవచ్చు. ఈ భక్తునిలాగే మనమూ ప్రభుని నమ్మాలి. అతని ఆదుకోలు కొరకు ఎదురుచూడాలి. అతడు ఏ క్షణంలోనైనా మనకు సాయం అందించవచ్చు.

23. పశ్చాత్తాపమూ వినయమూ - కీర్త 51, 16-17

యెరుషలేము దేవాలయంలో ప్రజలు జంతుబలులు అర్పిస్తున్నారు. కాని జంతుబలుల వలన దేవుడు ప్రతీజెందడు. నిజమైన బలిపశువు భక్తుడే. కనుక దాసుడు తన హృదయాన్నే దేవునికి అర్పించుకోవాలి. కీర్తనకారుడు పశ్చాత్తాపమూ వినయమూగల హృదయాన్ని దేవునికి అర్పించుకొంటున్నాడు. పశ్చాత్తాపమెందుకంటె, మనం పాపులం కనుక. దేవుడు మన పాపాలను క్షమించేవాడు కనుక. వినయమెందుకంటె, దేవుడు సృష్టికర్త కనుక. సృష్టికర్త ముందు సృష్టిప్రాణికి వినయం తగుతుంది. కనుక భక్తుడు వినయంతో పశ్చాత్తాపంతో దేవుణ్ణి సమీపించాలి.

24. ప్రభువు కరుణ - కీర్త 103, 11-14

103వ కీర్తన భగవంతుని కరుణను వర్ణిస్తుంది. భూమికి ఆకాశం అనంతమైన యెత్తు, దేవునిపట్ల భయభక్తులు చూపే వారియెడల అతని ప్రేమ అంత ఎత్తుగా వుంటుంది. పడమరకు తూర్పు అనంతమైన దూరం. దేవుడు మన పాపాలను అంతదూరంగా విసరి పారవేస్తాడు. తల్లిదండ్రులు తమ కుమారులమీద జాలిజూపినట్లే భగవంతుడు నరులమీద నెనరు జూపుతాడు. ఎందుకు? మనం ఆదాము కోవకు చెందిన వాళ్లం. “ఆద్మ" అంటే మట్టి. మనం మట్టినుండి పుట్టినవాళ్లం. దుర్భల ప్రాణులం. దేవదూతలం కాదు. కనుక ప్రభువు మనలను కరుణతో జూస్తాడు. భగవంతుని కారుణ్యాన్ని అనుభవానికి తెచ్చుకొని అతనిపట్ల నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి ఈ చరణాలు బాగా ఉపయోగపడతాయి.

158