పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసాం. ప్రవక్తల ప్రబోధాలను పెడచెవిని పెట్టాం. మా పాపాల వలన మేము ఈ ప్రవాసానికి వచ్చి అవమానం తెచ్చుకొన్నాం. మా పుణ్యకార్యాలను జూచిగాక నీ మంచితనాన్ని జూచి ఇప్పడు మమ్ము క్షమించు" అని మనవి చేసాడు. ఈలా మనం నిజాయితీతో దేవుని ముందు మన తప్పిదాలను ఒప్పుకొంటే అతడు మనలను తప్పక క్షమిస్తాడు.

19. అన్నా గీతం - 1 సమూ 2, 4-6

ఎల్కనాకు ఇద్దరు భార్యలు. పెనిన్నాకు సంతానం కలిగిందిగాని అన్నా గొడ్రాలుగా ఉండిపోయింది. ఆమె షిలోదేవళానికి వెళ్ళి ప్రభువుకు ప్రార్థన చేసింది. హృదయవేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. నాకు ఒక మగబిడ్డను ప్రసాదించావంటే వాణ్ణి నీ సేవకే అర్పిస్తాను" అని మొక్కుకొంది. దేవుడు ఆమె మొరవిని సమూవేలు అనే బిడ్డను ప్రసాదించాడు. అప్పుడు అన్నా పరమానందం చెంది దేవుణ్ణి స్తుతించింది. “బలశాలుల విల్లలు విరిగిపోయాయి. బలహీనులు బలాఢ్యులయ్యారు. కలవారు కూటికి కూలికిపోతే ఆకలిగొన్న దరిద్రులకు అన్నం దొరికింది. గొడ్రాలు ఏడ్గురు బిడ్డలను కంది. చంపేవాడు బ్రతికించేవాడు ప్రభువే" అని పలికింది. అనగా దేవుడు దీనులను కరుణిస్తాడని భావం. భగవంతుని ముందు వినయంతో మనదారిద్ర్యాన్ని తెలియజేసికొంటే అతడు మనలను సంపన్నులను జేస్తాడు.

20. యూదితు వేడికోలు - 13, 5–7

హోలోఫెర్నెసు యూదియా నగరమైన బెతూలియాను ముట్టడించాడు. యూదితు ధైర్యంతో అతని శిబిరానికి వెళ్లింది. సైన్యాధిపతి తప్పత్రాగి మత్తెక్కి పడకమీద తూలిపడి వున్నాడు. ఆ ధీరురాలు అతని శిరస్సును నరికే సమయం ఆసన్నమైంది. ఆమె ఇలా ప్రార్ధించింది "ప్రభూ! నేను యేరూషలేము కీర్తికొరకే ఈ కార్యానికి పూనుకొన్నాను. నీవు నాకు సహాయంచేసి మా శత్రువును హతమార్చు. నీ వెన్నుకొనిన ప్రజలను రక్షించు. నాకు బలాన్ని దయచేసి నా కత్తితో నేనితని గొంతు నరికేలా చేయి". ఒక ఆడగూతురు శత్రుసైన్యాధిపతి తల నరకడం సులువుకాదు. ఐనా దైవబలంతో ఆమె ఆ కార్యం సాధించింది. శత్రువులు ఓడిపోయి పారిపోయారు. ప్రార్థనాబలంతో సాహసకార్యాలు సాధిస్తాం. గండాలనుండి బయట పడతాం.

21. నా దేవా! నన్నేల చేయి విడిచావు? - కీర్త 22, 1.9-11

22వ కీర్తన వ్రాసిన భక్తుడు ఏదో ఆపదలో వుండి దేవునికి మొరపెట్టాడు. నాదేవా! నాదేవా! నన్నేల చేయి విడిచావు అని దీనంగా వేడుకొన్నాడు. తల్లి కడుపునుండి

157