పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తీర్మానించుకున్నాడు. కాని యెరూషలేములోని సమాజం మాత్రం అత్యాసక్తితో పేత్రుకోసం ప్రభువునకు విజ్ఞాపనం చేసింది. దాని ఫలితంగా ప్రభువు దూతవచ్చి పేత్రుని చెరసాలలో నుండి విడిపించాడు. ఈలాగే మన విజ్ఞాపన ప్రార్ధనలూ ఆపదలో నున్నవారిని ఆదుకొని కాచి కాపాడుతూంటాయి.

16. యేసు తల్లియైన మరియు గూడ - ఆ చ 1,14

ప్రభువు వుత్ధానమైన పిమ్మట మోక్షానికి ఆరోహణంచేసూ శిష్యులను యెరూషలేము వదలి వెళ్లవద్దని ఆజ్ఞాపించాడు. పూర్వవేదపు ప్రవక్తలద్వారా శతాబ్దాలు తరబడి తండ్రి వాగ్దానం చేస్తూ వచ్చిన పరిశుద్దాత్మను ఆ పట్టణంలోనే పొందమని ఆదేశించాడు. ఆ యాత్మ దిగిరావడమే వాళ్ళ జ్ఞానస్నానమౌతుంది. ప్రభువు ఆజ్ఞాపించినట్లే శిష్యులంతా యెరూషలేములోనే బస చేసారు. ఓ మేడమీది గదిలో సమావేశమై ఆత్మాగమనం కోసం ప్రార్థిస్తూ వచ్చారు. ప్రభజనని మరియమాతకూడ అక్కడే వాళ్లతోపాటు ప్రార్ధనం చేసింది. ఆమె ప్రార్ధనం ఆమెకోసమూ, శిష్యులకోసమూను. ఆమె ప్రభువునకు మల్లె శిష్యులకు గూడ మాత. ప్రభువు అదేశించినట్టే శిష్యులు ఆత్మను పొందాలి అని ఆ తల్లి కోరిక. అందుకే వాళ్ల తరఫున గూడ విజ్ఞాపనం చేసింది. నాల్గవ శతాబ్దంలోనే ప్రాచీన క్రైస్తవులు ఈ తల్లిని "విజ్ఞాపన మాత" అని పేర్కొన్నారు.

17. ఎవరెవరి కోసం ప్రార్థించాలి?

పూర్వవేదపు అహరోను పరిశుద్ధ స్థలమైన గుడారంలోకి ప్రవేశించేప్పడెల్ల యిస్రాయేలీయులలోని పండ్రెండు గోత్రాలవాళ్ళ పేర్లను లిఖించిన పట్టీనొకదాన్ని రొమ్ముమీద ధరించేవాడు. ఆ పట్టీద్వారా యిస్రాయేలీయుల పేర్లను ప్రభుసన్నిధిలో జ్ఞాపకం చేసేవాడు - నిర్గ, 28, 29. ఈలాగే మనంకూడ తోడి ప్రజలను ప్రభువునకు జ్ఞాపకం చేస్తూ వుండాలి. ఈ తోడి ప్రజల్లోకూడ మనకున్న సంబంధాన్ని పరస్కరించుకొని కొందరి కోసం విశేషంగా ప్రార్ధిస్తుండాలి. మనం ఎవరెవరికి ఋణపడి వున్నామో వాళ్ళ పేర్లను ఒక జాబితాగా తయారు చేసికొని వాళ్ళందరికోసం ప్రార్ధిస్తూవుండడం ధర్మం.

18. బృందంగా కూడి - మత్త 18,20

పూర్వవేదంలోని రబ్బయిలు మోషే ధర్మశాస్తాన్ని బోధిస్తూవుండేవాళ్లు, యూదులుబృందంగా కూడి ఆ బోధలు ఆలిస్తూ వుండేవాళ్ళు. అలా ధర్మశాస్త్ర బోధలు ఆలించడంకోసం బృందంగా కూడినవాళ్ల మధ్యలో ప్రభు సాన్నిధ్యం నెలకొని వుంటుందని ఆ ప్రజలు విశ్వసించేవాళ్లు. ఆ సాన్నిధ్యాన్నే "షెకీన" అని పిలచేవాళ్ళు. ఇక నూత్నవేదంలోని