పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండిన పంటలకు దేవునికి వందనాలు అర్పించడానికీ, రానున్న యేడుకూడ మంచిపంటలు దయచేయమని అడుగుకోవడానికీ యూదులు ఈ పండుగ చేసుకొనేవాళ్ళు.

ఏడవనాడు ఒక పెద్ద ప్రదక్షిణం జరిగేది. చేతుల్లో పచ్చని కొమ్మలు పట్టుకొని ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు ప్రదక్షిణం గీహోను ఊటదగ్గరికి వెళ్ళేది. ప్రధాన యాజకుడు బంగారు కూజాను తీసికొనివెళ్ళి ఆ చెలమలో నీళ్ళ ముంచుకొని ఆ నీటిని ప్రదక్షిణంతో దేవళంలోనికి తీసికొనివచ్చి అచట బలినర్పించే పీఠంపైన కుమ్మరించేవాడు. ఆ సందర్భములో అతడు పూర్వం ఎడారిలో మోషేకు రాతిబండనుండి నీళ్ళు లభించిన ఉదంతాన్ని ప్రజలకు జ్ఞప్తికి తెచ్చేవాడు. ఆలాగే ప్రభువు సకాల వరాలు కురిపించి యిస్రాయేలు ప్రజలకు నీళ్ళు దయచేయాలని ప్రార్థించేవాడు.

ఈలాంటి ఉత్సవసందర్భంలో క్రీస్తు దేవళం ముందటి వసారాలలో నిల్చుండి దప్పికగొన్నవాళ్ళు తన దగ్గరికివచ్చి దాహం తీర్చుకోవచ్చునని ప్రకటించాడు. పూర్వవేదం నుడివే జలశిలా, జీవజలమూ, జీవజలాల ఊట అన్నీ తానేనని నుడివాడు.

ప్రభువు అంతరంగంలోనుండి జీవజలం వెలువడుతుందని చెప్పాం. ఈ జీవజలం అతని ప్రక్కలోనుండి కారబోయే నీటిని సూచిస్తుందన్నాం. ఈ నీరు ఆత్మకు చిహ్నంగా వుంటుందని కూడా చెప్పాం. ఇక యిదేలాగో పరిశీలిద్దాం.

3. క్రీస్తు ప్రక్కలోనుండి ఆత్మ వెలువడ్డం

మనం ఆత్మను ఎప్పుడు పొందుతాం? ఆత్మ చాలా గొప్పవ్యక్తి, చాల గొప్పవరం. ఆ యాత్మను మనం ఒక్కసారే పూర్తిగా పొందలేం. మన హృదయం సిద్ధమైన కొద్దీ, మనభక్తి కొద్దీ, జీవితంలో చాలా పర్యాయాలు ఆత్మను పొందుతూనే వుంటాం. క్రీస్తు ఉత్థానమైన దినాన శిష్యులు ఆత్మను పొందారు. ఉత్థానక్రీస్తు వాళ్ళకు కన్పించి వాళ్ళమీద గాలివూది మీరు ఆత్మను పొందండి అన్నాడు. - యోహా 20, 22. ఆలాగే వాళ్లు పెంతెకోస్తు దినానగూడ ఆత్మను పొందారు. ఆ దినం వాళ్ళంతా పరిశుద్ధాత్మతో నిండిపోయారు. - అచ 2,4. ఈలా శిష్యులు ఆత్మను పొందిన సందర్భాలు చాలావున్నాయి. ఈలాగే క్రీస్తు ప్రక్కలోనుండి నీళ్ళు కారడంగూడ ఆ యాత్మ వేంచేసిన సందర్భాల్లో ఒకటి అనుకోవాలి.

యోహాను సువిశేషంలో క్రీస్తు జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నపుడు ఆత్మ వస్తుందని ప్రవచించాడు - 7, 38. సిలువమీద అతని ప్రక్కలో నుండి నీళ్ళు కారినపుడు ఈ ప్రవచనం నెరవేరింది - 19,34. ఇక్కడ క్రీస్తు ప్రక్క అంటే క్రీస్తు హృదయం అని అర్థంచేసికోవాలి. కనుక అతని హృదయంలో నుండి జలం, లేక ఆత్మ వెలువడింది. ప్రభువు మనకు ఆత్మను దయచేసిన సందర్భం ఇదొక్కటే కాకపోవచ్చు. కాని ఆ సందర్భాల్లో ఇది కూడా ఒకటి అనాలి.