పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వొడ్డుమీద రకరకాల ఫలవృక్షాలు పెరుగుతున్నాయి. ఆ చెట్ల ఆకులు ఏనాడూ వాడవు. ఆ చెట్లు ప్రతినెలా పండ్లు కాస్తాయి. ఆ ఫలాలు ఆహారానికీ, ఆ యాకులు మందుకీ పనికివస్తాయి" అని చెప్తుంది యెహెజ్కేలు ప్రవచనం 47, 1-12. దేవళంనుండి వెలువడే యేరు పంటలు పండించి కాయలు కాయించి ప్రాణదానం చేస్తుందని ఈ వాక్యాల భావం. ఈ యేరు కూడ క్రీస్తు ప్రక్కలో నుండి కారిన నీటిని సూచిస్తుంది. ఈ నీరు మనకు జీవాన్ని ప్రసాదిస్తుంది. తన హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని ప్రభువే పేర్కొన్నాడుకదా? - యోహా 7, 38.

4. "ఆ దినాన ఒక క్రొత్త ఊట వెలువడుతుంది. దాని నీరు దావీదు వంశజులనూ యెరూషలేము ప్రజలనూ పాప మాలిన్యం నుండి కడిగి శుద్ధి చేస్తుంది" అని చెప్తుంది జెకర్యా ప్రవచనం 13,1. ఈ వూట కూడ బల్లెంతో తెరవబడిన క్రీస్తు ప్రక్కనే సూచిస్తుంది. ఆ ప్రభువు హృదయం నుండి కారిన జలాలు మన హృదయాన్ని కడిగి శుద్ధి చేస్తాయి.

5. "అటుతరువాత దేవదూత జీవనదీ ప్రవాహాన్ని నాకు చూపించాడు. అది దేవుని సింహాసనంనుండీ, గొర్రెపిల్ల సింహాసనం నుండీ వెలువడుతూంది. స్ఫటికంలా మెరుస్తూంది. నగరమధ్య మార్గంగుండా ప్రవహిస్తూంది. ఆ నదికి రెండుప్రక్కలా జీవవృక్షాలు వున్నాయి. అవి నెలకు ఒకమారు చొప్పున ఏడాదికి పండ్రెండుసార్లు కాపు కాస్తాయి. ఆ చెట్ల ఆకులు ప్రజల గాయాలను మాన్పుతాయి" అని చెప్తుంది దర్శన గ్రంథం 22, 1-2. పూర్వం పేర్కొనిన యెహెజ్కేలు ప్రవచనాన్ని మనసులో పెట్టుకొని ఈ వాక్యాలు వ్రాసాడు యోహాను. ఈ ప్రవాహం కూడ క్రీస్తు ప్రక్కలో నుండి కారిన జలాన్నే సూచిస్తుంది.

6. ప్రభువు సమరయ స్త్రీతో ఈ బావిలోని నీళ్ళు త్రాగేవాళ్ళకు మళ్ళా దప్పిక కలుగుతుంది. కాని నేనిచ్చే నీళ్ళు త్రాగేవాడికి ఇక యెన్నటికీ దప్పిక కలుగదు. నేనిచ్చే నీళ్ళు నిత్యజీవానికై అతనిలో వూరే నీటి బుగ్గగా తయారౌతాయి" అన్నాడు - యోహా 4, 13-14. ఈ వాక్యం కూడ ప్రభువు ప్రక్కలోనుండి కారిన నీటిని సూచిస్తుంది. ఆ నీళ్లు క్రీస్తు హృదయంలో నుండి మన హృదయంలోనికి ప్రవహిస్తాయి. మన యెదలో బుగ్గగా ఊరతాయి. మన దప్పికని శశ్వతంగా తీరుస్తాయి.

ఈ విధంగా జలాలు స్రవించడాన్ని గూర్చి చెప్పే పై వేదవాక్యాలు క్రీస్తు ప్రక్కలోనుండి కారిన నీటిని సూచిస్తాయి. కాని యీ వుదాహరణాలన్నీ ఒక యెత్తు, యోహాను 7,37-38 ఒక్కటే ఒక యెత్తు. ఈ యాలోకనం క్రీస్తు ప్రక్కలోనుండి కారిన నీటిని సూటిగా పేర్కొంటుంది. కనుక దీన్నిగూర్చి కొంచెం విపులంగా పరిశీలిద్దాం.