పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నా యాత్మను నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను
విశ్వసనీయుడవైన ప్రభూ! నన్ను రక్షించేది నీవే"

ఈ కీర్తనలో భక్తుడు తన్నుతాను భగవంతుని చేతుల్లోకి అర్పించుకొంటున్నాడు. ఆపదల్లోనుండి తన్ను కాపాడేది ప్రభువేనని విశ్వసిస్తున్నాడు. కనుకనే క్రీస్తు చివరి గడియల్లో ఈ ప్రార్థనను జపించాడు. తన ఆత్మనూ ప్రాణాన్నీ జీవితాన్నంతటినీ తండ్రి చేతుల్లోపెట్టి నిశ్చింతగా కన్నుమూసాడు.

మనలనందరినీ మృత్యువు లాగుకొనిపోతుంది. ఇష్టం లేకపోయినా ఏడుస్తూ చావుకి లొంగిపోతాం. కాని క్రీస్తుని మృత్యువు ఆలా నిర్బంధం చేయలేదు. అతడు స్వేచ్ఛగా మనకొరకు ప్రాణాలర్పించాడు. బుద్ధిపూర్వకంగా మృత్యువుని ఆహ్వానించాడు. అతడు మనలాగ తప్పనిసరయి చనిపోలేదు. ఇష్టపూర్తిగా చనిపోయాడు. మనలాగ దుఃఖిస్తూ మరణించలేదు. సంతోషంగా కన్నుమూసాడు.

మనం మృత్యుకాలం మన పరలోక జీవితాన్ని నిర్ణయిస్తుంది అనుకొంటాం. మంచి చావు చనిపోతే మోక్షమూ చెడ్డచావు చనిపోతే నరకమూ సిద్ధిస్తాయి అని భావిస్తాం. కాని యథార్థంగా మన మృత్యుకాలంకాదు, మన జీవితకాలమే పరలోక జీవితాన్ని నిర్ణయిస్తుంది. తండ్రి చిత్తాన్ని పాటిస్తూ మంచి జీవితం జీవించేవాళ్ళకి మంచి మరణమూ మోక్షభాగ్యమూ వాటంతట అవే లభిస్తాయి. ఇక క్రీస్తు జీవితాంతమూ తండ్రి చిత్తాన్ని పాటించాడు. నరుల పాపవిమోచనం కొరకు తన ప్రాణాన్ని బలిపెట్టాడు. అలా బలిపెట్టడం ద్వారా తాను ప్రదర్శించిన సోదరప్రేమ అనన్య సామాన్యమైందని రుజువు చేసాడు - యోహా 15,13. ఈలాంటి క్రీస్తు ఇప్పుడు సంతోషంగా చనిపోక దుఃఖిస్తూ చనిపోతాడా?

కొన్ని పెద్దగ్రహాలు చాలయేండ్ల తర్వాత తమ ఆకాశ ప్రయాణాన్ని ముగించుకొని మళ్ళా తమ పూర్వస్థానాన్ని చేరుకొంటాయి. ఆలా చేరుకొని తమ గమన రీతులను నిర్ణయించిన సృష్టికర్తకు మౌనంగా చేయెత్తి నమస్కరిస్తాయి. ఆలాగే క్రీస్తుకూడ తండ్రి తనకు నిర్ణయించిన ఇహలోక సంచారాన్ని ముగించుకొన్నాడు. స్వీయార్పణం ద్వారా నరులను విమోచించాడు. దానికి ముప్పైమూడేండ్లకాలం పట్టింది. ఇప్పడు మళ్ళా తన్ను పంపిన తండ్రి వద్దకు తిరిగిపోయాడు. అతని సన్నిధిలో ఆసీనుడయ్యాడు, అతని కీర్తిలో తానూ పాలు పొందాడు. పూర్వవేదంలో "ప్రభువు" అనే బిరుదం తండ్రికి ఒక్కడికే చెల్లుతుంది. ఆ తండ్రి కుమారుడు సాధించిన మానవ విమోచనాన్ని మెచ్చుకొని ప్రభువు అనే తన బిరుదాన్ని ఆ కుమారునికి గూడ ఇచ్చి సత్కరించాడు. ఇకమీదట ప్రభువు అనే బిరుదాన్ని ధరించిన ఈ క్రీస్తుకి త్రిలోకవాసులందరూకూడ శిరం వంచి నమస్కారం చేయాలి - ఫిలిప్పి 2,9-11.