పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూత్నవేద గ్రంథాలు కాదుగాని తొలి శతాబ్దాల్లోనే వెలసిన కల్పిత గ్రంథాలు కొన్ని ఈ మంచిదొంగ పేరు డిస్మస్ అని చెపున్నాయి. చెడ్డదొంగపేరు జెస్టస్ అనికూడ చెప్తున్నాయి.మంచిదొంగపేరు ఏదైనా, అతనికి ఇంతకు పూర్వమే క్రీస్తునిగూర్చి తెలుసు. అతడు ఆ ప్రభువు బోధలు వినివుంటాడు, అద్భుతాలు చూచివుంటాడు. క్రీస్తు తెలిపిన దైవరాజ్యాన్ని గూర్చిగూడ కొంత అర్థంచేసికొనే వుంటాడు. కనుకనే "నీవు నీ రాజ్యంలోకి ప్రవేశించినపుడు నన్నుగూడ జ్ఞాపకముంచుకో" అని మనవి చేసాడు. అదే అతని విశ్వాసానికి నాంది.

అతడడిగింది తన్ను గురుంచుకొమ్మని మాత్రమే. కాని అడిగినదానికంటె అదనంగా క్రీస్తు అతన్ని బహూకరించాడు. నేడే నీవు నాతో కూడా పరలోకం చేరుకొంటావని అతనితో పల్మాడు. అనగా అతడు మోక్షం చేరుకొని క్రీస్తు సన్నిధిలో వుంటాడు. క్రీస్తుతోపాటు తానూ రాజ్యపాలనం చేస్తాడు. మనమందరమూ చనిపోయాక మనకు మోక్ష బహుమానం లభిస్తుందనే మాట వింటాం, కాని యితడు బ్రతికివుండగానే తనకు మోక్ష బహుమానం సిద్ధిస్తుందనే అమృతవాక్కు విన్నాడు.

చనిపోయేవాడొకడు చనిపోయే మరొకనిని తనకు నిత్యజీవమీయమని అడిగాడు. తనకు దైవరాజ్యం ప్రసాదింపమని వేడాడు. తాను కోరినట్లే ఆ రాజ్యాన్ని పొందాడు. కనుక అతడు చనిపోతూగూడ దొంగగానే చనిపోయాడు, దైవరాజ్యాన్ని దోచుకున్నాడు. క్రీస్తు సిలువ మరణంవల్ల మొదటిసారిగా విమోచనం పొందింది అబ్రాహాము లాంటి పుణ్యపురుషుడెవడూకాదు,ఓ దొంగ.

క్రీస్తు మరణకాలంలో శిష్యులే ఆ గురువుని నమ్మలేదు: అసలు వాళ్ళల్లో ఒక్కడు మాత్రమే సిలువ దగ్గర నిల్చుండి వున్నాడు. ఆలాంటి విషమ పరిస్థితుల్లో ఈ దొంగ క్రీస్తుని రక్షకుణ్ణిగా అంగీకరించగలిగాడు అంటే, అతని విశ్వాసం చాల గొప్పదై యుండాలి. కనుకనే రక్షకుడు ఈ దినమే నీవు నాతోకూడ మోక్షాన్ని ప్రవేశిస్తావు అని పల్మాడు. ఆ దొంగ విశ్వాసానికి తగిన బహుమానం అది.

జీవితంలో చాలమంది క్రీస్తుని సమీపిస్తారు కాని అతన్ని విశ్వసించేవాళు కొద్దిమందే విశ్వసిస్తున్నామనే వాళ్లల్లోకూడ పూర్తి విశ్వాసం వుండదు. కాని పూర్ణంగా విశ్వసించేవాళ్ళకేగాని క్రీస్తు దక్కడు. అన్నిటికంటె విశ్వాసం ముఖ్యమైంది. కనుక ఆ మూగదయ్యం పట్టిన బాలకుని తండ్రిలాగే మనంకూడ "ప్రభో! నేను నిన్ను విశ్వసిస్తూనే వున్నాను. ఐనా నా విశ్వాసంలో ఏమైనా లోటు వుంటే నీవే దాన్ని సవరించు" అని ప్రార్థించాలి - మార్కు 9,24