పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండ్రి ఈ పాపలను ఎందుకు క్షమించాలి? వాళ్ళ చేసేదేమిటో వాళ్ళకే తెలియదు కనుక. ఆ పాపులకే గనక క్రీస్తు దైవసుతుడని తెలిస్తే, తెలిసీ అతన్ని చంపిస్తే, ఇక వాళ్ళకు విమోచనం వుండదు. వాళ్లు అతని నెత్తురుద్వారా తమకు పాపవిమోచనం కలుగుతుందని అర్థంచేసికొంటే ఆలా అర్థంచేసికొనిగూడ అతన్ని వధిస్తే ఇక వాళ్ళకు రక్షణంగాదు శిక్షణం కలుగుతుంది. కనుక క్రీస్తు విరోధులు అజ్ఞానంవల్ల బ్రతికిపోయారు. ఒకోమారు విజ్ఞానంకాదు అజ్ఞానం మనలను రక్షిస్తుంది -1కొ 2, 8.

శిక్షకు గురై చనిపోయేవాళ్లు తాము నిర్దోషులమని చెప్పకొని తమకు దండన విధించినవాళ్ళను నిందించనైనా నిందిస్తారు, లేదా తాము దోషులమని ఒప్పకొని క్షమాపణం అడగనైనా అడుగుతారు. కాని నిర్దోషియైన క్రీస్తు ఈలా క్షమాపణం ఏమీ అడగలేదు. తాను దేవునికీ నరునికీ మధ్య మధ్యవర్తి కనుక అతడే తన్ను హింసించే పాపులకు క్షమాపణాన్ని అనుగ్రహించాడు. అతడు తన్ను తానే బలిగా అర్పించుకొనిన యాజకుడు కనుక పాపాత్ముల నేరాలను పరిహరించమని తండ్రికి మనవి చేసాడు.

పూర్వం ఆదాము పాపం చేసినపుడు దేవుడు అతన్నిక్షమిస్తానని మాటయిచ్చాడు. స్త్రీ సంతానం పిశాచం తల చితుకగొడుతుందని ప్రమాణం చేసాడు - ఆది 3,15, ఇప్పడు క్రీస్తు బాధామయ సేవకుడి రూపంలో వచ్చాడు. సిలువ మీద వ్యధ ననుభవిస్తూ పూర్వం తన తండ్రి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాడు.

నరులు సామాన్యంగా శత్రువులను క్షమించరు. క్షమాపణం ఒక్కదేవునికే చెల్లింది. క్రీస్తు సిలువమీదినుండి శత్రువులను క్షమించినతీరు తొలినాటి క్రైస్తవ భక్తులను చాల ప్రభావితం చేసింది. ఆ ప్రభువు క్షమాపణాన్ని మనస్సులో పెట్టుకొనే సైఫను తన విరోధులను క్షమించాడు. "ప్రభూ! ఈ పాపాన్ని వాళ్ళమీద మోపవద్దు" అని మనవి చేసాడు - అ,చ. 7.60. అలాగే, రోములో చెరలోవున్న పౌలుని స్నేహితులందరూ వదలివేయగా అతడు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ప్రభువు వారి తప్పిదాన్ని మన్నించుగాక అని వ్రాసాడు - 2 తిమో 4,16. మన కాలంలో గాంధీ క్రీస్తు క్షమావాక్యాలకు చాల ముగ్గుడైపోయాడు. నూత్నవేదంలోని పర్వత ప్రసంగంలాగే ఈ వాక్యంగూడ గాంధీని చాల ప్రభావితం చేసింది.

పూర్వం హేబెలు నెత్తురు కయీనుని శిక్షించమని దేవునికి మొరపెట్టింది. దేవుని కోపాన్ని రెచ్చగొట్టింది - ఆది 4, 10. కాని హేబెలులాంటి పుణ్యపురుషులందరినీ సూచించిన క్రీస్తు నెత్తురు మాత్రం శిక్షణనుగాక రక్షణను కోరింది. కనుకనే సిలువమీద నెత్తురోడ్చి ప్రాణాలు విడిచే క్రీస్తు శత్రువులను శిక్షింపమనిగాక క్షమించమని తండ్రికి మనవి చేసాడు - హెబ్రే 12, 24.