పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్షమించనేలేదు. అందుచేత వినయవంతుని ప్రార్థననేగాని ప్రభువు ఆదరింపడు - లూకా 18, 9–14. మరోతావులో చిన్నబిడ్డల్లాగ దేవుని రాజ్యాన్ని అంగీకరించమన్నాడు - మార్కు 10, 15. చిన్నబిడ్డలు తల్లిదండ్రులమీద ఆధారపడి జీవిస్తూవుంటారు. ఈలా ఆధారపడ్డమే వినయం, శిష్యులుకూడ వినయంతో ప్రభువుమీద ఆధారపడి జీవిస్తూ వండాలి. కనుక వినయంతో ప్రార్ధనం చేసి కోవడమనేది మనం పాటించవలసిన నాల్గవ నియమం.

7. మర్యాదా ప్రవర్తనం - ఆది 18, 27

ప్రార్ధనాపరునికి వినయంతో పాటు మర్యాదాభావం కూడ అత్యవసరం. అబ్రాహాము సౌదొమగొమత్థాల తరఫున ప్రభువును మనవి చేస్తూ "దుమ్మునూ బూడిదయు నైన నేను సాహసం చేసి ప్రభువుతో మాటలాడుతున్నాను" అంటాడు. దేవుడంటే యేమిటో అర్థం చేసికున్న మహానుభావులకు ఈలాంటి మర్యాదా ప్రవర్తనం అలవడుతుంది. ప్రార్ధనం చేసుకునే నరుడు దైవసాన్నిధ్యం కలిగించుకోవాలి. క్రీస్తు గూడ తన తండ్రికి ప్రార్ధనం చేసేప్పడు చనువుతో "తండ్రీ" అనడు. మర్యాదతో "పరిశుద్దుడవైన తండ్రీ" అని సంబోధించాడు - యోహా 17,11. కనుక మనం ప్రార్ధనం చేసేప్పుడు దైవసాన్నిధ్యం కలిగించుకోవాలి. దైవసాన్నిధ్యంలో వుంటున్నాం గనుక మర్యాదా ప్రవర్తనం అలవరుచుకోవాలి. అనగా అణకువతో ప్రభువును వేడుకోవాలి. ప్రార్థనా సమయంలో మనం అవలంబించే ఆసనం కూడ భక్తి వినయ మర్యాదలను ప్రదర్శిస్తూ వుండాలి. పైన జెప్పిన నియమాలన్నీ పాటించినట్లైతే మనవి జపం ప్రభువునకు విన్పించి తీరుతుంది.

8. దేనికోసం ప్రార్థించాలి? - ఫిలి 46

మనం దేనికోసం ప్రార్ధించాలి? కేవలం ఆధ్యాత్మిక అవసరాల కోసం మాత్రమేనా లేక భౌతికావసరాలకోసం గూడ ప్రార్జించవచ్చా? నరుడు దేహాత్మల సంయోగం. కనుక మనం ఆత్మావసరాలను పరస్కరించుకొని ప్రార్ధించాలి, దేహావసరాలను పురస్కరించుకొనీ ప్రార్థించాలి. కూడు, గుడ్డ,యిల్లు, బ్రతుకుదెరువు, పని, ఆరోగ్యం మొదలైన భౌతికావసరాలు ప్రభువునకు నివేదించుకోవాలి. భక్తి, విశ్వాసం, ప్రేమ పరిశుద్ధజీవితం, మనశ్శాంతి, రక్షణం మొదలైన ఆధ్యాత్మికావసరాలూ ప్రభువునకు విన్నవించుకోవాలి. అందుకే పౌలు ఫిలిప్పీయులను హెచ్చరిస్తూ, అన్ని అవసరాల్లోను ప్రభువును మనవిచేసికొమ్మన్నాడు. కనుక మనమూ మన అక్కరలను - అవి భౌతికమైనవి గానీ ఆధ్యాత్మికమైనవి గానీ - ప్రభువునకు తెలియజేసికుంటూ వుండాలి.