పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండ్రెడవ స్థలం

క్రీస్తు సిలువపై ప్రాణాలు విడవడం

క్రీస్తు మూడుగంటలకాలం ఓర్పుతో సిలువపై వ్రేలాడాడు. స్లీవ ప్రక్కనే నిలచియున్న మాతృమూర్తి మరియను యోహానుకీ, యోహానుని మరియకూ అప్పగించాడు.

ఒంటరిగా మన పాపాలన్నీ తన భుజస్కంధాలపై నిలుపుకొని పితయెదుట దీనతతో నిలబడ్డాడు ప్రభువు. ఈ గడియలో అతని హృదయంలో ఏలాంటి భావాలు చెలరేగాయో మనుష్యమాత్రులకు ఎవ్వరికీ తెలియదు. అంతట క్రీస్తు"నాపితా! నాపితా! నన్నేల చేయివిడిచావ" ని యెలుగెత్తి అరచాడు. దేవుని కుమారుని దేవుడే చేయివిడవడం ఏలాగో మనకు అర్థంకాదు. మనకు తెలిసిందల్లా ఒక్కటే. ఇంతవరకు క్రీస్తు హృదయం పితసన్నిధిలో మెలగగిల్లింది. ఇప్పడు ఆ పితసన్నిధికూడ దూరమైపోయింది. రెండంశాలు మాత్రం క్రీస్తుని చివరిగడియ వరకు సహించుకొని వుండేలా చేసాయి. మొదటిది, అతడు పితచిత్త పద్ధతికి లొంగడం. రెండవది, అతనికి మనపైగల ప్రేమ.

మనపైగల ప్రేమచే క్రీస్తు దహించుకొనిపోయాడు. ఆ దహనం పూర్తికాగానే అతడు సమస్తం నెరవేరిందని చెప్పి తలవంచి ప్రాణాలు విడిచాడు.

పాపినైన నేను క్రీస్తు ప్రాణాలనే బలిగోరిన పితయొక్క న్యాయదృష్టికి తలవంచి నమస్కరిస్తాను. నా కొరకై ప్రాణాలొడ్డిన క్రీస్తుకి ఆరాధన, కృతజ్ఞత చెల్లిస్తాను.

ప్రార్ధనం

పరార్థ ప్రేమైకజీవివైన ప్రభూ! నీపట్లగల ప్రేమవలన నా బాధలను నేనుగూడ సహించాలని నేర్పుతున్నావు. నీవలె నేనుగూడ పితచిత్త పద్ధతిని అంగీకరిస్తాను. పితపై దృష్టి నిల్చినపుడు నా యాతనలను నేను ఓర్పుతో సహింపగల్లుతాను. నా బాధలు వ్యర్థంకావు. అవి నీ బాధలతో గలసి లోకాన్ని ఉద్ధరింపగలవు. ఈ సత్యం నాకెంతో ఓదార్పుని కలిగిస్తుంది.

నా చివరి గడియలు సమీపించి, యిక జీవించి ప్రయోజనం లేదని తోచినపుడుగూడ నేను చేయగల మహత్తర కార్యం వొకటుంది. నీతో ఐక్యమై నా బాధలను నా ప్రాణాన్ని నా చేతగానితనాన్నిగూడ ఇతరుల మేలు కొరకై నీకప్పగిస్తాను. నా జీవితము నా సహాయత్వమూ మాత్రమేగాక, నా మరణమూ నా నిస్సహాయత్వమూ గూడ నీకు సమర్పణ యోగ్యాలే, ఈ సమర్పణం దప్ప బాధలనూ మృత్యువును జయించే మార్గం మానవులమైన మాకు మరొకటి దొరకదు.