పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తునుండి ముఖం త్రిప్పకొని అవతలకు పోరాదు. మనకొరకు ప్రభువు ఫరోరయాతనలు అనుభవిస్తూంటే మనం ప్రక్కకు తొలగిపోకూడదుగదా!

ఇంతవరకు క్రీస్తుదారిలో కనీసం నడవనైన నడుస్తూ, కదిలాడనైన కదిలాడాడు. ఇక యిప్పటినుండి ఆ యవకాశం గూడ లేదు. ప్రక్కకు మెదలడానికైనా వీల్లేదు. సిలువపై వ్రేలాడుతూ నిస్సహాయుడై నిశ్శబ్దంతో సర్వం సహిస్తూ వూరకుండవలసిందే, ఆ దుస్థితి శోకభరితం. ఆ దురవస్థ దుఃఖపూరితం.

కొరడా దెబ్బలకు చినిగి నజ్జయిన దేహమందూ, వ్రణమయమయిన శిరస్సు నందూ నొప్పినిప్పలాగ మండుతూంది. క్షణక్షణానికి అధికమయ్యే దప్పిక ముప్పతిప్పలు పెడుతూంది. దేహం సిలువపై వ్రేలాడుతూ క్రిందికి కుదించుకొనిపోవడంచే సరిగా గాలియైన పీల్చుకొనే అవకాశంలేక హృదయం ఆయాసపడుతూంది. ప్రభువు తనకుతాను కొద్దిపాటి సహాయమైన చేసికోలేని దురవస్థలో ఉన్నాడు. కనీసం తలను అటూఇటూ కదల్చడానికైన అవకాశంలేదు, మరణం దానంతటది సమీపించేవరకూ అతడు ఘోరయాతనలను ఈ రీతిగా సహిస్తూ ఊరుకోవలసిందే. ఈ సమయంలోనైన ప్రక్కనున్న యూదుల హృదయాలు కరగలేదుకదా, వారి జంతుప్రవృత్తి మరింత విజృంభించింది.

ప్రార్ధనం

యాతనావహుడవైన ప్రభూ! నీ బాధలన్నిటికీ కారణం నా పాపాలే. కనుక పాపినైన నన్ను క్షమించు, నీ వనుభవించిన సిలువబాధలు నాపట్ల వ్యర్థంగాకుండును గాక. నీ దివ్యశాంతం నాయందు వేరుబాతుకొనునుగాక.

నిందావమానాలు వ్యాధిబాధలూ అనుభవిస్తూ ఏమీ చేయలేక సహనంతో పడివుండవలసిన విషమదశ మాకూ ఒకనాడు ప్రాప్తించవచ్చు. మా చివరి గడియల్లో తరచుగా ఈ దురవస్థ ప్రాప్తిస్తుంది. ఈ దశలో మేమూ సిలువకు అంటగొట్టబడతాం. ఇక కదిలాడలేం, నోరు మెదపలేం. ఈ దురవస్థలో ఇక మేము చేయగలిగింది ఒక్కటే. మా చిత్తాన్ని నీపై నెలకొల్పి మేమూ నీ బాధలతో ఐక్యంగావాలి. నీవలె చివరిగడియ కొరకు ఎదురుజూస్తూ, కేవలం విశ్వాసంతోనే జీవిస్తూ సహనంతో వుండిపోవాలి.

ప్రభూ! నా చివరి గడియల్లో నన్ను చేయి విడువకు. నీవు సిలువపై అనుభవించిన దౌర్బల్యం నా అవసాన సమయంలో నాకు చాలినంత బలాన్ని చేకూర్చి పెట్టనుగాక.