పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ స్థలం

యేసు మూడవసారి స్లీవ క్రింద కూలబద్దం

రెండవసారి కూలబడి యెంతోసేపు కాలేదు. ఇంతలోనే ప్రభువు మరల మూడవసారి బోర్లగిలబడినాడు. ఔను, అంతటి ఘరబాధలను అనుభవించే ప్రభువు నేలకు ఒరిగిపోక యెంతసేపని నిలువగలడు? అతని ఆత్మ మరణాన్ని అనుభవించేంతగా క్రుంగిపోయింది. అట్టి పరిస్థితిలో అట్టి గుంపులో, అట్టి భారంతో, అన్నిసారులు నేలకు ఒరిగిపోవడమంటే యేమిటో మనం ఊహింపనైన ఊహింపలేం. క్రీస్తు శరీరంలోని బలమంతా వ్యయమైపోయింది. ఇక మిగిలింది నిస్సత్తువే. ఐనా ఏ బలంచేతనో ఎరుగంగాని అతడు నిదానంగా పైకిలేచాడు. తన్ను తాను ఈడ్చుకొంటూ తనవెంట సిలువను ఈడ్చుకొంటూ, పట్టుదప్పి తొట్రుపడే అడుగులతో, అట్టిటు ఊగులాడే దేహంతో, ఎట్టకేలకు కొండ కొమ్మకు వచ్చాడు. అచట అతనికి సిద్ధింపబోయేది విడుదలగాదు, మరణం.

ప్రార్ధనం

ప్రేమగల తండ్రీ! నీ వెంత బలవంతుడవు! ఎంత చిత్త స్టైర్యం గలవాడవు! నీవు నాయందూ నేను నీయందూ నెలకొనివుండే భాగ్యాన్ని దయచేయి. నీతో ఐక్యమై, నీ సత్తువలో పాల్గొంటూ నేనూ నీలాగే చివరి గడియ వరకు, ఒంటిలోని వెలుగు ఆరిపోయేంత వరకూ స్థిరచిత్తంతో నిలువ గలను. నీ సహాయంతో నా బాధ్యతలను - అవి యెంత భారమైనవైనాసరే - సక్రమంగా నిర్వహింపగలను, ఆపదలు వచ్చినపుడు పిరికితనానికి లోనై యెదలోని చేవను గోల్పోయి, చేయవలసినదానిని చేయకపోవడం, చేయగూడని దానిని చేయడం అనే అనర్థంనుండి నన్ను కాపాడు. నేను చేవనుగోల్పోయి క్రిందికొరిగి నేలకు కరచుకొని యున్నపుడు నీ యమృత హస్తంతో నన్ను మరల పైకిలేపు, మూడుసార్లు క్రిందబడి మూడుసార్లు మరల పైకిలేచినవాడవు నీవు కావున మేము బలహీనతతో పడిపోగూడదని నీవు కోరుకోవు. పడిపోయిన పిదప నేలకు అంటిపెట్టుకొని వుండకుండా మరల పైకిలేచి ముందుకి సాగిపోవాలని మాత్రం కోరుకొంటావు. మా యిహలోక జీవితయాత్ర అంతా మాటిమాటికి పడిపోవడం, మాటిమాటికి పైకిలేచి ముందడుగు వేయడమేనని మేము గ్రహించేలా చేయి.