పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ స్థలం

యేసు రెండవసారి స్లీవక్రింద కూలబడ్డం

సీమోను చేసిన సహాయం అంతగా ఉపయోగపడలేదు. కొంతసేపైన పిదప అతడు ఆ కొద్దిపాటి సహాయాన్ని గూడ మానివేసి పూర్తిగా వైదొలగి వుండవచ్చు. ఇక క్రీస్తుని ఆదుకొనేవారు ఎవరున్నారు? సైనికులు క్రీస్తు ఎదుటవున్న మరియమాతను ప్రక్కకు పంపివేసారు. శిష్యులు అంతకుముందే పారిపోయారు. సానుభూతి చూపేవాళ్ళు ఎవరైనా వెంట వస్తున్నా అచటి గుంపును త్రోసికొని ముందుకు రాగలరా?

క్రీస్తుని ఓ ప్రక్క సిలువభారం, వేరొక ప్రక్క అంతకన్న అధికంగా నరుల కృతఘ్నతా భారం క్రుంగదీస్తున్నాయి. నిర్మల ప్రేమభావంతో ప్రభువు ఆ ప్రజలకు భగవత్సా ప్రమాజ్యాన్ని గూర్చి బోధించాడు. క్రీస్తు వ్యాధులు నయంచేసినవాళూ, రొట్టెలతో ఆహారం పెట్టిన వాళ్లూ కొందరైన ఆ గుంపులో వుండేవుంటారు. కాని వాళ్లు ఆ క్షణంలో క్రీస్తునుండి అన్యాయానికి గురైన వాళ్ళలాగ, దుర్బుద్ధితో ప్రవర్తించారు, ఈ రీతిగా మంచిని మరచిపోయిన ఆ ప్రజల నీచప్రవృత్తి క్రీస్తుని రెండవసారి నేలకొరిగేలా చేసింది.

క్రీస్త గబాలున క్రిందగూలి నేలకు కరచుకొని వున్నాడు. అప్పడు అతని హృదయంలో ఓ దివ్యమైన వెలుగు ప్రకాశించింది. ప్రజలు తనపట్ల జూపే క్రూరకృత్యాల ద్వారానే యేసు వారిని ఉద్ధరింపనున్నాడు. తన బాధలద్వారా మానవలోకాన్ని అధోగతినుండి లేవనెత్తనున్నాడు. అతడు ఈ వెలుగుయొక్క బలంతో ఏలాగో పైకిలేచి ముందుకి సాగిపోయాడు.

ప్రార్ధనం

బాధాపథగామివైన ప్రభూ! ఇతరుల కొరకు బాధలు అనుభవించడం ఎంత దొడ్డకార్యమోగదా? బాధలన్నిటిలోను గుప్తమైయున్న ఒకానొక మాధుర్య గుణం గోచరిస్తుంది. నీ బాధలద్వారానే మా బాధలు తీరుతాయని నీకు తెలుసు. మేము బాధావిముక్తులం కావడంకంటె నీకు కావలసింది యేమీలేదు. ఈ గొప్ప సత్యాన్ని నేనుకూడ జీర్ణించుకొని నా తోడివారికి దానిని అన్వయింపజేయుదునుగాక. నా కష్టాలూ బాధలూ శ్రమలూ పరిత్యాగాలూ నీ శ్రమలతో చేర్చి తోడివారి మేలుకొరకు పరలోక పితకు అర్పింతును గాక.