పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్యాయస్థానానికి లాక్కొనిపోతూ వచ్చారు. శ్రమలవలనను, నెత్తురు కారిపోవడం వలనను అతనిలో బలహీనత పెచ్చుపెరిగింది. చుట్టుముట్టియున్న వారి నీచత్వం, తోడివారి క్రూరత్వం అతన్ని క్రుంగదీసాయి. కనుక అతడు అలసిసాలసి యున్నాడు.

ఆ స్లీవకూడ చాల బరువైంది. క్రీస్తుకి మించిన భారమది. కాళ్ళ తొట్రిల్ల తుండగా, హృదయం వేగంగా కంపిస్తూండగా, కొంతదూరం స్లీవను మోసికొని నడచి పోయాడు. క్రీస్తు, అంతలో రాతిని తట్టుకొనో లేక ఆ వెంట వచ్చే గుంపులో ఎవరైన నెట్టినందుననో, గబాలున స్లీవ క్రింద కూలబడ్డాడు. ఆలాంటి సమయాల్లో మనుష్యులు మొరటుగా ప్రవర్తిస్తారు. నేలమీద కూలబడిన ప్రభువునిజూచి కొందరు ఎగతాళిగా నవ్వారు. కొందరు తిట్టారు. కొందరు కొట్టి గద్దించారు.

క్రీస్తు అంతలో శక్తిని దెచ్చుకొని మెల్లగా పైకి లేచాడు. బహుకష్టంతో సిలువను మళ్ళా పైకి లేపుకొని, ఇదివరకే గాయపడివున్న భుజాలమీద నిల్పుకొని ముందుకి అడుగులు వేసాడు.

ప్రార్ధనం

శోకభరితుడవైన స్వామి! నీకు మించిన బరువు ఆ సిలువ. ఐనా పితచిత్తం గావున, మా రక్షణానికి అవసరం గావున, నీవా బరువుని ఓర్పుతో భరించావు. ఇది నాకు మించిన బరువని నీవా సిలువను ఆవల పారవేయలేదు. క్రిందబడి, మరల ప్రయత్నపూర్వకంగా పైకిలేచి, ఎట్టలో ముందుకి సాగిపోయావు. నేను అనుభవించే బాధలుకూడ ఒకనాడు ఇక వీటిని నేను అనుభవింపలేను అనేంతటి విషమపరిస్థితికి రావచ్చు. మనుష్యులు కష్టంకొరకుకాక సుఖంకొరకు సృష్టింపబడ్డారు. కనుక ప్రతి స్లీవ వాళ్ళకు దుర్భరంగానే కన్పిస్తుంది. కనుక ఈ బాధలను నేనిక భరించలేను అనే పలుకులు కష్టాల్లో జిక్కిన ప్రతి మానవుని నోటినుండి వెలువడతాయి. ప్రభూ! ఈలాంటి దుఃఖకరమైన సమయాల్లో నీ ఓర్పు, నీ బలమూ నాకు శక్తినిచ్చి నన్ను ముందునకు నడిపించునుగాక. స్లీవ యెంత భారమైనదో, ఎంతగా క్రుంగదీసేదో నీ వెరుగుదువు. కావున నేను నా స్లీవను మోయలేనపుడు, నా బలం క్షీణించిపోయినపుడు నీవు నాపై కోపపడవు. కరుణతో నన్నులేవనెత్తుతావు. తండ్రీ! నీవు చూపిన శాంతం, ఓర్పు నా హృదయమందును, నీవు ప్రదర్శించిన బలం, దార్థ్యం నా అవయవాల్లోను నెలకొనేలా చేయి. నీ శక్తి నా యాత్మలోనికి ప్రవేశించినపుడు నేను క్రిందబడినాగూడ పైకి లేవగలను. క్రుంగిపోయినాగూడ నా బరువుని నేను మోసికొని ముందుకి సాగిపోగలను. నీవు నాయందు ప్రవేశించిన క్షణంలో నేను నేనుగా ఉండను. నీవే నేనై యుంటాను. ఇంతకంటే దొడ్డ భాగ్యం ఏంకావాలి?