పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ లోకంలో ఎవరైనా మన అక్రమాలకు తగినట్లుగా మనలను దండింపబూనితే, మన హృదయం ఎంతో బాధపడుతుంది గదా! మనకు అంతటి దండనం విధించడం సబబుకాదని పదేపదే వాపోతాంగదా? శిక్షారలమైగూడ శిక్షను పొందడానికి ఇష్టపడంగదా? కాని క్రీస్తో అంటే ఏ నేరమూ చేయకుండానే, ఏ పాపమూ కట్టుకోకుండానే, అధర్మంగా శిక్షారుడని నిర్ణయింపబడ్డాడు. ఆ సమయంలో అతని సుకుమార హృదయం ఎంతగా బాధపడిందో ఎవరు ఊహింపగలరు?

ప్రభువు కాదనలేదు. పల్లెత్తి మాటాడలేదు. నిండు మనస్సుతో ఆ దండనాన్ని అంగీకరించాడు. ఎందుకంటే అది పిత చిత్తం, మన రక్షణానికి అవసరం.

ప్రార్ధనం

  పురోగామివైన ప్రభూ! నీవు ముందు సాగిపోతూ నాకు మార్గాన్ని ఏర్పరచావు. నా గడియ వచ్చినపుడు నేను కూడ నీవు నడచిపోయిన కష్టపుత్రోవ వెంటనే, నీ వెనువెంటనే, నడచివచ్చే భాగ్యం దయచేయి. తోడి ప్రజలు నిన్ను వలె నన్నును నిందించినపుడు, నాకు అన్యాయపు తీర్పు విధించినపుడు, నీ కొరకు ఆ నిందనూ అన్యాయాన్నీ ఓర్పుతో భరించే వరప్రసాదాన్ని నాకు అనుగ్రహించు. ఇతరులు అసంమంజసబుద్ధితో నన్నువేధించేపుడు నీవలె నేనుగూడ మౌనం వహించి నిజనిజాలు ఎరిగిన ఆ పరలోకపిత చేతుల్లోనికే నా తీర్పును సమర్పించుకొందునుగాక. నా బాధ్యతలు నిర్వహించడం కష్టమని తోచినపుడు, అది పిత చిత్తమని గ్రహించి ఆ భారాన్ని ఓర్పుతో మోయుదును గాక, వ్యాధిబాధలవలనా కష్టనష్టాలవలనా క్రుంగిపోయినపుడు నీవలె నేనుకూడ పిత చిత్తానికి లొంగివుండే విధేయ గుణాన్ని మాత్రం నాకు ప్రసాదించు.

రెండవ స్థలం

క్రీస్తు సిలువను భుజాలమీదికి ఎత్తుకొనడం

    పిలాతు తీర్పు విధించాడు. క్రీస్తు మౌనంగా శిక్షను అంగీకరించాడు. సిలువగూడ సిద్ధంగానే వుంది. దోషిగా నిర్ణయింపబడిన క్రీస్తే దాన్ని వధ్యస్థానానికి మోసికొని పోవాలి.
    క్రీస్తు సిలువను చేకొంటున్నాడు. బంట్రౌతులు సిలువనెత్తి తన భుజాలమీద పెడుతుంటే క్రీస్తు చేసేదేమీ లేక వెర్రిగాజూస్తూ వట్టినే నిలబడిపోలేదు. అతడు స్వయంగా చేతులుచాచి సిలువను పైకెత్తి భుజాలమీద నిల్పుకొన్నాడు.