పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. దుషునినుండి మమ్మ రక్షించు

   ఈ విన్నపం గూడ క్రీస్తు యాజక ప్రార్థనలో వుంది. అతడు తండ్రి నుద్దేశించి "వారిని లోకంనుండి తీసికొని పొమ్మని కాదు, దుషునినుండి కాపాడమని నిన్ను ప్రార్ధిస్తున్నాను" అన్నాడు - యోహా 17,15. కనుక ఈ విన్నపంలో పిశాచ ప్రభావం నుండి మనలను కాపాడమని తండ్రిని వేడుకొంటున్నాం. ఈ ప్రార్ధనం కూడ వ్యక్తిగతమైంది కాదు, సాముదాయికమైంది, తిరుసభ అంతా కలసి ఈ జపం చేస్తుంది.                                                  
   ఈ వాక్యంలో మనం సూచించే వ్యక్తి పిశాచం. అతడు దేవుని రక్షణప్రణాళికకు అడు తగిలేవాడు. ప్రపంచాన్నంతటినీ మోసగించేవాడు. మొదటినుండి నరహంత, అబద్దాలకోరు - యోహా 8,44, అతని ద్వారానే పాపం లోకంలోనికి ప్రవేశించింది. ఇప్పడు లోకమంతా అతని ప్రభావానికి లొంగి వుంది - 1 యోహా 5,19, అతని వోటమి ద్వారా నరజాతికి పాపంనుండీ మృత్యువు నుండీ విముక్తి కలుగుతుంది.
   మన పాపాలను పరిహరించిన ప్రభువు మనలను పిశాచ తంత్రాలనుండి గూడ కాపాడతాడు. తన్నుతాను దేవుని కాపుదలకు అర్పించుకొనేవాడు పిశాచానికి భయపడనక్కరలేదు. దేవుడు మన పక్షాన వుంటే ఎవడైన మనకు హాని చేయగలడా? ప్రభువు తన సిలువమరణం ద్వారానే ఈ లోకనాయకుణ్ణి జయించాడు. ఈ లోకాధికారిని వెలుపలకు త్రోసివేసాడు - యోహా 12,31. మరియమాత పిశాచ శక్తికి లొంగలేదు. మనకు కూడ ఆ దుష్టశక్తి నుండి విమోచనం కలుగుతుంది. 
    భూతభవిష్యద్వర్తమాన కాలాల్లో పిశాచం తెచ్చిపెట్టే అనర్గాలన్నిటినుండి కాపాడమని కూడ ఈ విన్నపంలో దేవుణ్ణి అడుగుతున్నాం. లోకంలోని బాధలన్నీ తొలగించమని కూడ ఈ చివరి విన్నపంలో తిరుసభ దేవుణ్ణి మనవి చేస్తుంది.
    ఇంకా తనకు శాంతినీ, విశ్వాసమందు నిలకడగా వుండే భాగ్యాన్ని దయచేయమని దేవుణ్ణి అడుగుతూంది. క్రీస్తు రెండవ రాకడ ద్వారా ఈ వరాలు మనకు లభిస్తాయి. మృత్యువుకీ నరకానికీ అధికారి అతడే - దర్శ 1,18, పూజలో పరలోకజపం తర్వాత వచ్చే ఈ క్రింది ప్రార్ధన ఈ సందర్భానికి బాగా తగుతుంది. "ఏలినవారా! అన్ని కీడులనుండి మమ్ము రక్షించండి. మా యీ రోజులతో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకుండునట్లు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షిస్తున్నాం."
    పరలోకజపం చివరలో “మీదే రాజ్యం, అధికారం, మహిమ" అనే మాటలు వస్తాయి. పిశాచం గర్వంతో ఈ మూడు లక్షణాలను తనకు ఆరోపించుకొంది. అందుకే క్రీస్తు ఇక్కడ ఈ మూడు లక్షణాలను తిరిగి దేవునికే ఆరోపించాడు.