పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. ఆరాధన సమాజం, యూదులు సమాజంగా గూడి దేవుణ్ణి పూజించేవాళ్లు ఆ యారాధనంగూడ వాళ్ళను ఐక్యపరచింది. ఆ యారాధన సమాజాన్నే పూర్వవేదం "దైవసమాజం" అని పిల్చేది. తర్వాత ఇదే నూత్న వేదంలో శ్రీసభ ఐంది.

4. నూత్న ప్రజను గూర్చిన ప్రవచనాలు

 పాతప్రజలైన యిస్రాయేలీయులు దేవుని ఆజ్ఞలుమీరి పాపం కట్టుకొన్నారు, వాళ్ళు ప్రభువు ఆశించినట్లుగా పవిత్రజీవనం గడపలేదు. కనుక ప్రభువు వాళ్లను పరిత్యజించాడు. మరోప్రజను ఎన్నుకోవాలని నిర్ణయించుకొన్నాడు, వారితో తాను నూత్నంగా నిబంధనం చేసికోగోరాడు. పూర్వవేద ప్రవక్తలు ఈ నూత్న ప్రజనూ, నూత్న నిబంధననూ గూర్చి చాల ప్రవచనాలు చెప్పారు. వాటిల్లో మూడింటిని పేర్కొందాం.
   ప్రభువు తన ఆత్మద్వారా ప్రజల హృదయాలు మారుస్తాడు. వాళ్లల్లోని రాతి గుండెలను తొలగించి వాటిస్థానే మాంసపు గుండెను నెలకొల్పుతాడు. ఫలితంగా ప్రజలు దేవునికి విధేయులై దైవాజ్ఞలను పాటిస్తారు - యెహెజ్కేలు 36, 26-27. ప్రభువు ప్రజల్లోనుండి పవిత్రులైన వారిని వేరుపరుస్తాడు. వారిని శేషజనంగా తయారు చేస్తాడు. తరువాత మెస్సియా ఉద్భవించేది ఈ వర్గం వాళ్ళనుండే - యెష10, 20-22 ప్రభువు ఈ వర్గంవాళ్ళతో నూత్న నిబంధనం చేసికొంటాడు. ఈమారు అతని ధర్మవిధులు రాతిపలక మీదకాక ప్రజల హృదయాలమీదనే లిఖింపబడతాయి. కనుక పూర్వ ప్రజలవలెకాక ఈ నూత్న ప్రజలు దేవుని ఆజ్ఞలను శ్రద్ధతో పాటిస్తారు -యిర్మీ31-31-84. పూర్వ ప్రజలకంటె విధేయులూ ఆజ్ఞాబదులూ పవిత్రులూ ఐన నూత్న ప్రజలు ఉద్భవిస్తారనీ ఈ ప్రవచనాల భావం
   పూర్వవేద ప్రజలు యూదజాతికి మాత్రమే చెందినవాళ్ళని చెప్పాం. నూత్న ప్రజలమీద ఈలాంటి ఆంక్షయేమీ లేదు. అన్నిజాతులవాళ్ళూయిస్రాయేలీయుల్లో చేరవచ్చు "ఆరోజుల్లో చాలా జాతులవాళ్ళ వచ్చి మనం ప్రభువు పర్వతానికి ఎక్కిపోదాం. అతడు తన ఆజ్ఞలను మనకు బోధిస్తాడు. మనం అతని మార్గాల్లో నడుద్దాం అని చెప్పకొంటారు" అన్నాడు యెషయా -2.2-3. అనగా అన్నిజాతులవాళ్ళూ ఈ నూత్న జనంలో చేరిపోతారని భావం, ఈ జాతులవాళ్ళందరూ అబ్రాహాము పొందిన దీవెనల్లో తామూ పాలుపొందుతారు. ఇంకా ఓ గొప్ప సేవకుడుకూడ బయలుదేరివస్తాడు. అతని మధ్యవర్తిత్వం ద్వారానే నూత్న నిబంధనం ఏర్పడుతుంది. అతడు అన్యజాతులకు జ్యోతిగా వుంటాడు - యెష42,6.