పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలవాడు పేదవాణ్ణిచూచి మొగం ప్రక్కకు తిప్పకొంటాడు. ధనవంతుడు లాజరు కథే ఇందుకు తార్మాణం -లూకా 16, 19-31. పట్టుబట్టలు తాల్చి విందులూ వినోదాలతో కాలంగడిపే ధనవంతుడు ఒకడున్నాడు. లాజరు అనే బిచ్చగాడు అతని వాకిట పడివుండేవాడు. అతని వళ్ళంతా పుండ్లే.కుక్కలు అతని శరీరాన్ని నాకేవి. లాజరు ధనవంతుని బల్లమీదినుండి జారిపడే యెంగిలి మెతుకుల కొరకు కాచుకొని వుండేవాడు. కాని అతనికి అవికూడా దొరకలేదు. ధనవంతుడు అతన్ని యే మాత్రము పట్టించుకోలేదు. తర్వాత ఆ యిద్దరూ చనిపోగా ధనవంతుడు నరకానికీ, లాజరు మోక్షానికీ వెళ్ళారు.

ఈ సామెతలోని ధనవంతునికి శిక్షపడింది ప్రధానంగా అతడు దేవుణ్ణి విస్మరించి ధనాన్ని నమ్మకొన్నందుకు. కాని పేదవాడైన తోడినరుణ్ణి పట్టించుకోకపోవడంగూడ ఆతని నేరమే. దానికి గూడ ఆతడుశిక్షననుభవించాడు.

పేదలకొరకు కృషిచేసిన హెల్టర్ కామెరా అనే బ్రెజీలియన్ బిషప్పగారు ఈలా వ్రాసారు. "నేను చిన్నవాణ్ణిగా వున్నపుడు క్రీస్తు ధనంవల్ల అనర్గాలు కలుగుతాయని చెప్పిన మాటలు అతిశయోక్తలేమో అనుకొన్నాను. కాని యిప్పడు నాకర్థమయింది. ధనవంతుడికి తోడిజనంపట్ల దయ లేశమైనా వుండదు. డబ్బు మన నోటిమాటలూ, కడకు హృదయంకూడ మూగవోయేలా చేస్తుంది. డబ్బుకీ దయాదాక్షిణ్యాలకీ ఆమడ దూరం." కనుక కలిమిగలవాళ్లు జాగ్రత్తగా మెలగాలి. మన కలిమివల్ల సోదరప్రేమను పోగొట్టుకొనే ప్రమాదం కలిగితే ఆ కలిమిని విడనాడి సోదరప్రేమను పెంపొందించుకోవడం మేలు.

5. ఉన్నవాళ్ళ తమ సొమ్ముతో పేదసాదలను ఆదుకోవాలి

పైసామెతలోని ధనవంతునిలా కాకుండ, తోడినరుణ్ణి పట్టించుకోవాలి అనడానికి క్రీస్తు చెప్పిన పెద్ద సామెతలు రెండున్నాయి. అవి మంచి సమరయుని కథా, కడతీర్పు కథాను. తోడినరుల కొరకు మన ధనాన్ని వ్యయంచేస్తే దేవుని అనుగ్రహాన్ని సంపాదించుకొంటామని ఈ రెండు కథలూ సూచిస్తాయి. మంచి సమరయుడు గాయాలతో త్రోవప్రక్కనపడివున్నప్రాణ్ణి జూచి జాలిపడ్డాడు, అతని గాయాలకు కట్టకట్టి అతన్ని తనవాహనం మీద ఎక్కించుకొని సత్రానికి తీసికొని వెళ్లాడు. యజమానునికి రెండు దీనారాలిచ్చి అతన్ని పరామర్శించమని చెప్పాడు. ఎక్కువ ఖర్చయితే తాను మళ్ళా తిరిగివచ్చేపుడు చెల్లాస్తానని చెప్పాడు — లూకా 10, 34-335. ఈ మంచి సమరయుడే, మనకు ఆదర్శమని బోధించాడు క్రీస్తు, అనగా అతనిలాగే మనంకూడ అక్కరలోవున్న వాళ్ళకొరకు మన సొమ్మను వ్యయం చేయాలి.