పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవివేకియైన ధనికునికి ఏమి జరిగింది? పంటలు పండించడం, ధాన్యం గిడ్డంగుల్లో భద్రపరచడం, తిని త్రాగి సుఖాలనుభవించడం - ఇదే అతని దృష్టి భగవంతుడూ తోడినరులూ అతనికి గుర్తుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు అతని ప్రాణాలు తీసికొనిపోయాడు. అతని సిరిసంపదలన్నీ అన్యుల పాలయ్యాయి - లూకా 12,16-21. ఐహికవస్తు వ్యామోహం తెచ్చిపెట్టే అపాయం ఇదే కనుక భగవద్భక్తుడు ఈ యుపాయాన్నుండి జాగ్రత్తగా తప్పకోవాలి. నిండు హృదయంతో ఆ ప్రభువుని ఆశించడం అలవాటు చేసికోవాలి. అన్నిటికంటె అధికంగా అతన్ని పేమించడం నేర్చుకోవాలి. ఇంతకంటె దొడ్డ భాగ్యం మరొకటి లేదు.

6. ప్రార్ధనా భావాలు

1. అగస్టీను భక్తుడు "ప్రభో! మా హృదయాన్ని నీ కొరకే సృజించావు. నీయందు విశ్రమించినదాకా దానికి విశ్రాంతి అంటూ లేదు" అని నుడివాడు. ఇది చాల లోతైన భావం. మన హృదయం సృష్టి వస్తువుల కొరకు గాదు, సృష్టికర్త కొరకే చేయబడింది. కనుక సుఖభోగాలూ ధనమూ మొదలైన సృష్టివస్తువులేవీ దానికి పూర్ణ తృప్తినీయలేవు. కొయ్యల వల్ల అగ్ని తృప్తి చెందలేదు. మరి గుండెకు తృప్తినిచ్చే దేమిటి భగవంతుడొక్కడే కనుక జ్ఞాని అన్ని వస్తువుల కంటె అదనంగా ఆ ప్రభువుని కోరుకొంటాడు. అన్నివస్తువులను త్యజించియైనా ఆ ప్రభువుని సంపాదించడానికి పూనుకొంటాడు. మరి వస్తువులను మాత్రమే సంపాదించుకొని హృదయాధినాథుడైన ఆ ప్రభువుని కోల్పోయేవాళ్ళ వట్టి మూర్డులు.

2. తోమాసు అక్వెనాసు పదమూడవ శతాబ్దంలో వర్ధిల్లిన భక్తుడు, గొప్ప వేదాంతి. ఇతడు "సుమ్మతియొలోజిక" అనే సుప్రసిద్ధ వేదాంత గ్రంథాన్ని రచించాడు. ఓ మారు ప్రభువు ఇతనికి ప్రత్యక్షమై "తోమాసూ! నన్ను గూర్చి నీవు చక్కగా వ్రాసావు. భావితరాల వాళ్ళ నీ గ్రంథం చదివి నన్ను గూర్చి నేర్చుకొంటారు. నేను నీకేదైనా బహుమాన విూయాలని వచ్చాను. ఏమి వరం గావాలో అడుగు" అన్నాట్ట. తోమాసు చేతులు జోడించి "ప్రభూ! నేను నిన్ను గూర్చి చక్కగా వ్రాసానని నీవే చెప్తున్నావు. నేను నిన్ను చక్కగా అర్థం జేసికొన్నట్లయితే ఏమి వరం అడగగలను? నీకు మించిన వరం ఏమంది కనుక? నీవు నాకు ప్రత్యక్షమయ్యావు, అంతేచాలు. నీవు దప్ప నాకు ఏవరమూ అక్కర్లేదు" అన్నాట్ట, భగవంతుణ్ణి అర్థం చేసికొన్న భక్తుని తీరు ఈలావుంటుంది. మనం తరచుగా భగవంతుని వరాలను కోరతాం. ఇది భక్తి కాదు, స్వార్ధం. స్వార్ధం లేని భక్తుడు ఆ ప్రభువు వరాలను కాదు, అతన్నే ఆశిస్తాడు, మనం కూడ అన్నిటికంటె అదనంగా, అన్ని వస్తువుల కంటె పైగా, ఆ ప్రభువునే కోరుకోవాలి.