పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విధేయతలు అలవర్చుకోవాలి, శిష్యులు చిన్నబిడ్డల్లా కావాలి అన్నపుడు క్రీస్తు ప్రధానంగా ఉద్దేశించింది ఈ యాధార మనస్తత్వమే. ఈ మనస్తత్వం కలవాడే శిష్యుడు. ఇది చిన్న బిడ్డల్లో బాగా వుంటుంది. కనుక వాళ్ళ ఉత్తమ శిష్యులు.

ఇంకోసారి ప్రభువు, శిష్యులు పసిబిడ్డల్లాగ దైవరాజ్యాన్ని అంగీకరించాలి అని బోధించాడు - మార్కు 10,15. దీని భావం ఏమిటి? పరిసయులు మోషే ధర్మశాస్తాన్ని తుచ తప్పకుండా పాటిస్తున్నారు. ఈ యాచరణం ద్వారా వాళ్ళు దైవరాజ్యం విూద హక్కును సంపాదించాము అనుకొన్నారు. అనగా తాము ధర్మశాస్తాన్నిపాటించినందువల్ల దేవుడు తమకు మోక్షాన్ని విధిగా ఈయాలి అని వాళ్ళ భావం, ఎందుకంటే తాము నీతిమంతులు కనుక - లూకా 18,9. కాని అసలు వాళ్ళ ధర్మశాస్తాన్ని పాటించడానికే భగవంతుని కృప కావాలి కదా? కనుక మోక్షం విూద వాళ్ళకేదో హక్కువుంది అనుకోవడం పొరపాటు, మోక్షం విూద ఏ నరునికి, ఎంతటి భక్తునికి కూడ, హక్కు లేదు. అది యెవరికి లభించినా కేవలం ప్రభువు కృపవలననే. మరి యిక్కడ క్రీస్తు మనం పసిబిడ్డల్లా దైవరాజ్యాన్నిఅంగీకరించాలి అంటే, దాన్నిదేవుడు ఉచితంగా యిచ్చేవరంగా భావించాలని అర్థం. దాని మిూద మనకేదో హక్కువుంది అన్నట్లుగా ఎంచగూడదని భావం. కనుక దేవుడు మనకు మోక్షాన్ని విధిగా ఈయాలి అనుకోగూడదు, అతని కృపవలన మనకు మోక్షం ప్రాప్తిస్తుంది అనుకోవాలి.

పిల్లలు మనమేమైనా యిస్తే సంతోషంతో తీసికొంటారు. దాని విూద తమకు హక్కువుంది అనుకోరు. అలాగే మనం కూడ దేవుని నుండి మోక్షాన్ని స్వీకరించాలి.

తండ్రి దైవరాజ్య రహస్యాలను ఎవరికి తెలియజేస్తాడు? విజ్ఞలకూ వివేకవంతులకూ కాదు. పండితుల మనుకొని విర్రవీగేవాళ్ళకూ కాదు, మరి పసిబిడ్డలకి, ఎందుకు? వాళ్ళ దేవుణ్ణి భక్తితో నమ్ముతారు కనుక - మత్త 11,25. కనుక చిన్నవాళ్ళ దైవరాజ్య రహస్యాలను గ్రహించే శిష్యులు, పైన మనం పేర్కొన్న ఉదాహరణాలన్నీ చిన్న బిడ్డలను గూర్చి కాని ఈ యుదాహరణల్లో "చిన్న బిడ్డలు" అనే పదానికి శిష్యులు అని కూడ అర్థం చెప్పవచ్చు క్రీస్తు స్వయంగా తన శిష్యులను "చిన్నపిల్లలారా!" అని సంబోధించేవాడు. కొన్ని వాక్యాల్లో చిన్నబిడ్డడంటే శిష్యుడు, శిష్యుడంటే చిన్న బిడ్డడు అని అర్థం వస్తుంది. "మరియు నా శిష్యుడని యెంచి ఈ చిన్నవారిలో ఒకనికి గ్రుక్కెడు మంచినీళ్ళ నిచ్చినవాడ ప్రతిఫలమును పొంది తీరుతాడు" -మత్త 10,42. ఈ వాక్యంలో చిన్నవాడు శిష్యుడు, శిష్యుడు చిన్నవాడు.

ఫలితార్థమేమిటంటే చిన్న బిడ్డలు శిష్యులతో సమానం. శిష్యులకు చిన్నబిడ్డల మనస్తత్వం - అనగా ఆధార మనస్తత్వం వుండాలి. ఈలాంటి మనస్తత్వం అలవర్చుకొన్నప్పుడే మనం కూడ శిష్యులమయ్యేది.