పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుర్తుంచుకోవాలి. ప్రవచనం మనంతట మనం పలికేది కాదు. అది దేవుని ప్రోద్భలం వల్ల పట్టేది. ఆత్మ పలికించేది. కనుక ప్రభువు మనలను పలానా అన్యాయాన్ని గూర్చి మాట్లాడమంటున్నాడనే భావం కలిగినప్పడు మాత్రమే మనం ఆ ప్రభువు పేరు విూదిగా ప్రవచనం చెప్పాలి. అలా చెప్పేపుడు ఈ యంశానికి సంబంధించిన బైబులు వాక్యాలు ఒకటి రెండు ఉదహరించడం మంచిది.

 పైన చెప్పిన ఉదాహరణం సాంఘిక అన్యాయాన్ని చక్కదిద్దే ప్రవచనం. ఈలాగే తోడిజనులను ప్రోత్సహించే ప్రవచనం కూడ వుంది. ఓ తావలో కొందరు ఉపాధ్యాయులూ ఉపదేశులూ కలసి దీపావళి సెలవల్లో బైబులు సదస్సు జరుపుకొంటున్నారు. ఉపన్యాసకుడు "భక్తులారా! మిూరు దీపావళి వేడుకలు కూడ వదలిపెట్టి వచ్చి ఇక్కడ గుమిగూడి ప్రభు వాక్యం వింటున్నారు. విూ భక్తిని చూడగా నా భక్తి కూడ పెరుగుతూంది. నేను విమాకు ప్రభువాక్కు విన్చిద్దామనుకొన్నాను గాని మిూ మంచి ఆదర్శం ద్వారా మిూరే నాకు ఆ వాక్కు విన్పించారు. సరే, మనందరికీ బోధచేసేది ఆ ప్రభువే. భగవంతుడే స్వయంగా ఉపాధ్యాయుడై తన భక్తులకు బోధ చేస్తాడు అనే ప్రభువు వాక్యం ఉంది" అన్నాడు. ఈ పలుకుల వలన అక్కడ సమావేశమైన ఉపాధ్యాయులూ ఉపదేశులూ ప్రోత్సాహం చెంది శ్రద్ధతో సదస్సులో పాల్గొన్నారు. ప్రోత్సాహక ప్రవచనాలు ఈలా వుంటాయి.

 ఇతరులను ప్రోత్సాహపరచ దలచుకొన్నపుడు భగవంతుని కరుణనూ ప్రేమనూ పేర్కొనడం కూడ మంచిది. ఓ విద్యార్థి సమావేశంలో ఉపన్యాసకుడు దైవ ప్రేరణలతో "నా ప్రజలారా! మిూరు నా ప్రేమను గుర్తిస్తారు. నా రక్షణాన్ని చవిజూస్తారు. తల్లి తన ప్రేవున బట్టిన బిడ్డను మరచిపోతుందా! ఒకవేళ తల్లి తాను కనిన బిడ్డను మరచిపోతే పోతుందేమో కాని నేను మాత్రం మిమ్మ మరచిపోను" అన్నాడు. ఆ ప్రవచనానికి అక్కడి విద్యార్థులు తన్మయులై పోయారు. ప్రభువు తమ్మ ప్రేమిస్తున్నాడని గాఢంగా నమ్మారు. పెంతెకోస్తు సమావేశాల్లో భక్తులు ఈలాంటి ప్రవచనాలను ఎన్నిటినో విన్పిస్తుంటారు.

కొందరు మేమేమిటి ప్రవచనం చెప్పడమేమిటి అని జంకుతూంటారు. ఈలా భయపడనక్కరలేదు. ప్రభువు మన ద్వారా తోడిజనులకూ, తోడిజనుల ద్వారా మనకూ తన సందేశాన్ని విన్పిస్తూంటాడు. కనుక మన తరపున మనం, ప్రభువు అనుగ్రహం వలన మనం కూడ అతని సందేశాన్ని విన్పింపగలం అని నమ్ముతూండాలి. పైగా మనం ప్రభువు సందేశాన్ని విన్పించడానికి సిద్ధం కావాలి కూడ. ప్రభువు గ్రంథాన్ని భక్తితో చదువుకోవడం, ప్రార్ధనం చేసికోవడం, ప్రభువు మన అంతరాత్మలో విన్పించే ప్రబోధాలను ఆలించడం, తోడి ప్రజలయెడల దయా సానుభూతీ అలవర్చుకొని వాళ్ళ గోడు వినడం - మొదలైనవి ఈలా సిద్ధం కావడానికి మార్గాలు.