పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభుని స్తుతిస్తే బాగుంటుంది అనుకొన్నాడు - సంఖ్యా 11,29. ప్రభువు అంత్యదినాల్లో ప్రజలందరి విూదా తన ఆత్మను కుమ్మరిస్తాడనీ జనులంతా ప్రవక్తలౌతారనీ యోవేలు ప్రవక్త నుడివాడు - 2,28-29. పరిశుద్దాత్మ శిష్యుల విూదకి దిగివచ్చిన పిదప ఈ ప్రవచనం నెరవేరిందని పేత్రు యెరూషలేమలో తాను చేసిన మొదటి ప్రసంగంలో పేర్కొన్నాడు - అకా 2,16. ఈ వాక్యాన్నిబట్టినూత్న వేదంలో ప్రవచనం పూర్వవేదంలో కంటి గూడ అధికంగా వుంటుందని అర్థం చేసికోవచ్చు.

ఐనా పూర్వవేదంలోనే చివరి రోజులు వచ్చేప్పటికల్లా ప్రవచనం మందగించి పోయింది. 538లో యూదులు బాబిలోను ప్రవాసం నుండి తిరిగి వచ్చాక ప్రవచనం క్షీణించి పోయింది. 515 ప్రాంతంలో జకర్యా ప్రవక్తనాడు ప్రవచనానికి అట్టే గౌరవం లేదని తెలుస్తూంది - జక 13,2-6. దీనికి కారణమేమిటో రూఢిగా తెలియదు. బహుశః పూర్వవేదం లిఖితరూపంలో ప్రచారానికి వచ్చాక వాగ్రూపమైన ప్రవక్తల సందేశం మూలబడి వుంటుంది. గ్రంథాన్ని చదివి వ్యాఖ్య చెప్పే ధర్మశాస్త్రవేత్త ప్రవక్త స్థానాన్ని ఆక్రమించుకొని వుంటాడు.

ఐనా ప్రవచనం పూర్తిగా విలువను కోల్పోలేదు. నూత్నవేదం నాటికి గూడ ఆ ప్రక్రియ ప్రచారంలో వుంది. స్నాపక యోహాను మహా ప్రవక్త క్రీస్తు అందరినీ మించిన ప్రవక్త తర్వాత పౌలు నెలకొల్చిన క్రైస్తవ సమాజాల్లో చాలమంది ప్రవక్తలు వుండేవాళ్ళ అతడు ప్రవచనాన్ని అనాదరం చేయవద్దని ప్రత్యేకంగా హెచ్చరించాడు గూడ - 1తెస్స 5,19-20.

పూర్తిగా నశించకపోయినా ప్రవచనం విలువ క్రమేణ తగ్గిపోతూ వచ్చిందని చెప్పాం. నూత్నవేదం వ్రాయడం ముగిసి అపోస్తలులు గతించాక — అనగా మొదటి శతాబ్దం అంతానికి అది యింకా తగ్గిపోయింది. రెండవ శతాబ్దం నుండి శ్రీసభలో అధినార ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. బిషప్పలూ గురువులూ మొదలైన వాళ్ళు అధికారానికి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చి అన్నిటినీ కట్టుబాట్లలో పెట్టడం మొదలుపెట్టారు. ఈ యధికార మనస్తత్వం వల్ల మిగిలివున్నప్రవచనం కాస్త ఉక్కిరిబిక్కిరై నలిగిపోయింది.

ఈలా ప్రవచన ప్రమేయం లేకుండానే మన క్యాతలిక్ సమాజం రెండువేల యేండ్ల జీవితయాత్ర సాగించింది. కాని యిటీవల పెంతెకోస్తు ఉద్యమం ద్వారా ఈ వరం మళ్ళా ఊపిరిపోసికొని ప్రచారం లోకి వచ్చింది. ఇప్పుడు క్రైస్తవ శాఖలన్నిటిలోను, క్యాతలిక్ శాఖలో గూడ, ఈ వరం మళ్ళా తలెత్తుతూంది. ఇది శుభసూచనమే. ప్రభువు ఆదరంతో దయచేసిన ఈ వరాన్ని మనం అశ్రద్ధ చేయగూడదు గదా!