పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30. మనం వివ్వసనీయులం గాకపోయినా
క్రీస్తు విశ్వసనీయుడుగానే వుంటాడు
అతడు తన్నుతాను నిరాకరించుకొనడు -2 తిమో 2, 13

31. యేసుక్రీస్తు నిన్నా నేడూ, యెల్లప్పడూ ఒకేరీతిగా వుంటాడు - హెబ్రే 13,8.

16. ప్రభువు రక్షణదాత

నరుడు ఆపదల్లో చిక్కుకొని భగవంతునికి మొరపెట్టుకొంటాడు. అతని నుండి రక్షణం పొందగోరుతాడు. ప్రభువు తన దేవళం నుండీ, తాను వసించే సీయోను పర్వతం మీదినుండీ, భక్తుని మొర ఆలిస్తాడు. అతని వెలుగూ, సత్యమూ దూతల్లా బయలుదేరి వెళ్ళి భక్తుని తోడ్కొని వస్తాయి. నరుడు పేదవాడే కావచ్చు. దీనుడే కావచ్చు. అతని మొరను మాత్రం ప్రభువు అనాదరం చేయడు. అతడు భక్తణ్ణి కంటి పాపను కాపాడినట్లుగా కాపాడుతాడు. తల్లి పక్షిలాగ అతన్ని తన రెక్కలక్రింద దాచుకొంటాడు. భగవంతుడు ఆదుకోకపోతే, అతని ముఖకాంతి ప్రకాశించకపోతే, భక్తుడు ఎప్పడో మృతలోకం చేరుకొనేవాడే ఔను, ప్రభువు తన పావురాన్ని డేగపాలు చేయడు. ఆ పావురం వలలో చిక్కుకొని గూడ, ఆయన కరుణవల్ల తప్పించుకొంటుంది. ప్రభువు తన భక్తుణ్ణి దీర్గాయువుతో సంతృప్తి పరుస్తాడు. భక్తుడు ఆ ప్రభు రక్షణాన్ని పొంది సుఖిస్తాడు. యిస్రాయేలు దేవుడు నిద్రపోయేవాడూ కాదు, కునికిపాట్ల పడేవాడూ కాదు. నిత్యం మేల్కొని వుండి ప్రజలను గమనిస్తుంటాడు. రక్షిస్తుంటాడు. అలాంటి ప్రభుని నమ్మకొని జీవించే నరుడు ధన్యుడు గదా!

1. నా బాధల్లో ప్రభుని మనవి చేసాను
నా దేవునికి మొర్రపెట్టుకొన్నాను
తన దేవళంనుండి ప్రభువు
నా వేడుకోలు విన్నాడు నా యాక్రందనం అతని చెవిని పడింది - కీర్త 18,6

2. ప్రభువు తన దేవాలయం నుండి నీకు సహాయం పంపునుగాక
సీయోను కొండమీదినుండి నిన్ను ఆదుకొనునుగాక - 20,2

3. నీ వెలుగునూ నీ సత్యాన్నీ పంపించు
అవి నీవు వసించే పరిశుద్ధ పర్వతానికి
నన్ను తోడ్కొని వస్తాయి - 43,3

4. నేను కొండలవైపు పారజూచాను
ఎవరివద్ద నుండి నాకు సహాయం కలుగుతుంది?
భూమ్యాకాశాలను సృజీంచిన ప్రభువు నుండిగాని
నాకు సహాయం లభించదు - 121, 1-2