పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12. నేను పడకమీద పండుకొని నిన్ను స్మరించుకొంటూంటాను. రాత్రి నాల్లజాములు నిన్ను ధ్యానం చేసికొంటూంటాను - 63, 6
13. ప్రభువు వాక్కిది. నేను దేశంమీదికి కరువుని పంపే కాలం వస్తుంది. ఆ కరువు కూటికీ నీటికీ గాదు. ప్రభువు వాక్కుకే - ఆమోసు 8, 11
14. నేడు నేను మీకు విధించే యీ శాసనం కష్టమైందీ కాదు. అందుబాటులో లేనిదీకాదు. అది యెక్కడో ఆకాశంలో లేదు. కనుక మేము ఆ శాసనాన్ని విని పాటించడానికిగాను, ఎవరు ఆకాశాని కెక్కిపోయి దాన్నిక్కడికి తీసికొనివస్తారు అని మీరు అడగనక్కరలేదు. అది యొక్కడో సముద్రాలకు ఆవలలేదు. కనుక మేము ఆ శాసనాన్ని విని పాటించడానికిగాను, ఎవరు సముద్రాలు దాటిపోయి దాన్నిచటికి తీసికొనివస్తారు అని మీరు అడగనక్కరలేదు, అది మీ చెంతనే వుంది. మీ నోటిలోనే, మీ హృదయంలోనే వుంది. కనుక మీరు ఈ శాసనాన్నిపాటించండి - ద్వితీ 30, 11-14

15. ఈనాడు నేను మీకు విధించిన ప్రభువు ఆజ్ఞల్ని పాటించినట్లయితే, మీరు పెంపచెంది పెద్దజాతిగా విస్తరిల్లుతారు. మీరు స్వాధీనం చేసుకోబోయే గడ్డమీద ప్రభువు మిమ్మ దీవిస్తాడు. కాని మీరు ప్రభువుని విడనాడి అతని మాటలను తృణీకరిస్తే తప్పక నశిస్తారు. మీరు స్వాధీనం చేసుకోబోయే గడ్డమీదకూడ పెద్దకాలం జీవించరు - ద్వితీ 30, 16-18,
16. ప్రభువు ఆజ్ఞల గ్రంధం విజ్ఞానంతో గూడింది, అది శాశ్వతంగా నిల్చివుండే ధర్మశాస్త్రం. దాన్ని పాటించేవాళ్ళ బ్రతుకుతారు, నిరాకరించేవాళ్ళు చస్తారు - బరూకు 4,1. ప్రభువు నోటినుండి వెలువడే మాటలు నిత్యజీవ మిస్తాయి - యోహ 6, 18.
17. నరుడు కేవలం ఆహారంతోనే జీవించడు, ప్రభువు నోటినుండి వెలువడే ప్రతిమాట ద్వారా గూడ జీవిస్తాడు - ద్వితీ 8,3. యథార్థంగా భూమిమీది పైరుపంటలు నరులను పోషించలేవు. ప్రభువుని నమ్మినవాళ్ళని పోషించేది అతని నోటిమాటలే - సోలోమోను జ్ఞాన 16,26.
18. వానా మంచూ ఆకాశం నుండి దిగివస్తాయి. అవి ఆకాశానికి తిరిగి పోవు. భూమిని తడిపి దానిలో నుండి పైరు ఎదిగించి పంట పండిస్తాయి, రైతుకి విత్తడానికి విత్తనాలూ తినడానికి తిండీ సంపాదించి పెడతాయి. నా నోటినుండి వెలువడే వాక్కు కూడ ఈలాగే వుంటుంది,అది వ్యర్థంగా నా వద్దకు తిరిగిరాదు. నా చిత్తాన్నినెరవేరుస్తుంది. నేను పంపిన పనిని నిర్వహిస్తుంది - యెష55, 10-11.