పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవది, దేవుడు వెలుగు. సన్మనస్కులు కూడ వెలుగే వీళ్ళ మనకు వెలుగును ప్రసాదిస్తారు. దీనివలన మనం వేదసత్యాలను అర్ధం జేసికొని దేవుణ్ణి ప్రేమిస్తాం. మూడవది, దేవదూతల సాహచర్యంవల్ల మనం కూడ వాళ్ళలాంటి వాళ్ళమౌతాం. వాళ్ళలాగే మనం కూడ దేవునితో ఐక్యమౌతాం. మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేస్తూంటే దూతలు సంతోషిస్తారు,

7. మరణ కాలంలో, మన జీవితకాలమంతా మనతో వుండి, మనకు సహాయం చేసిన దూతలు మరణ కాలంలో మనలను విడనాడరు. ఆ చివరి గడియలు అతి ముఖ్యమైనవి కదా! కనుక మన అవసాన దశలో వాళ్ళ మనలను ఓదారుస్తారు. పిశాచ శోధనల నుండి మనలను కాపాడతారు. మనం క్రీస్తు పట్ల విశ్వాసాన్ని విడనాడకుండేలా జాగ్రత్తపడతారు. కడన మన ఆత్మను దేవుని సన్నిధిలోకి చేరుస్తారు. చనిపోయిన లాజరుని అబ్రాహాము ఒడిలోకి చేర్చింది దేవదూతలే గదా ?- లూకా 16,22. యూదుల భాషలో అబ్రాహాము ఒడి అంటే మోక్షమే.

8. ఉత్థాన కాలంలో, మనం చనిపోయాక చాలయేండ్లకు ఉత్థానం వస్తుంది. అంతకాలం దూతలు మన దేహాలను కాపాడుతూ మన ఉత్థానం కొరకు వేచిఉంటారు. ఆ దినం వచ్చినపుడు మనలను దేహాత్మలతో దేవుని చెంతకు కొనిపోతారు. దూతలు బూరల నూది దేవుడు ఎన్నుకొన్నవారిని అతని సమక్షంలోకి కొనిపోతారు - మత్త 24,31 ఆ పిమ్మట సాధారణ తీర్పు జరుగుతుంది, దూతలు మనలను ఆ తీర్పుకి సిద్ధం జేస్తారు. తీర్పు జరిగేపుడు మన ప్రక్కన ఉండి మనలను ఆదుకొంటారు - మత్త 25, 31-32, కట్టకడన మనలను మోక్షంలో చేరుస్తారు. ఈలా మనం పుట్టినప్పటినుండి మోక్షంలో అడుగు పెట్టిందాకా మనకు సకలోపచారాలు చేస్తారు.

3. దూతల గణాలు

దేవదూతలు ఎంతమంది ఉంటారు? ఎవరికీ స్పష్టంగా తెలియదు. పది లక్షల దాకా ఉంటారని కొందరు వేదశాస్త్రలు వాకొన్నారు. ఈ దూతల్లో ఏడుగురుని అతిదూతలుగా భావించి గౌరవిస్తూ వచ్చారు. తోబీతు గ్రంథం 12, 15 దీనికి ఆధారం. కాని ఈ యేడుగురిలో మనకు ముగ్గురిపేర్లు మాత్రమే తెలుసు. వాళ్ళ గబ్రియేలు, మికాయేలు, రఫాయేలు. గబ్రియేలు జకరియాకు మరియకు క్రీస్తు జనన సమాచారం తెలిపినవాడు. దేవుని వీరుడు అని ఈ పేరుకి అర్థం. మికాయేలు సైతానుతో పోరాడి అతన్ని ఓడించినవాడు. దేవుని వంటివాడు ఎవడు అని ఆ పేరుకి అర్థం. రఫాయేలు తోబియాకు ప్రయాణ స్నేహితుడు, చికిత్స చేసేవాడని ఆ పేరుకి అర్థం. కాని తోబీతు గ్రంథం చారిత్రకమైంది కాడు. నీతిబోధకమైన కల్పిత కథ మాత్రమే.