పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విధించాడు. ఇప్పడు మనం వద్దంటే కుదరదు - సీరా 41,1. మట్టినుండి పట్టిన నరుడు మళ్ళామన్నయిపోవలసిందే - ఆది 3,19. నరులందరికీ పట్టేగతి యిదే.

నరునికి చావంటే అనిష్టం. చావాలని ఎవడు కోరుకొంటాడు? కనుక అతడు చావుని ఓ భయంకర మూర్తిగా ఊహించుకొన్నాడు. మృత్యువు మనకు కాపరి. ఆ కాపరి మనలను గొర్రెలను లాగ పాతాళ లోకానికి తోలుకొనిపోతాడు - కీర్త 49,14. అది కొన్ని పర్యాయాలు దేవుడు పంపిన వినాశకారిలాగవచ్చి నరులను చంపిపోతుంది - నిర్గ 12,23. చావు తరచుగా వ్యాధి రూపంలో వస్తుంది. వచ్చి మనలను పాతాళానికి ఈడ్చుకొని పోతుంది. అది పంజా విసిరితే ఏ నరుడు తప్పించుకోలేడు. అసలు మన జీవితమంతా చావు అనే శత్రువుని తప్పించుకోవడానికి చేసే పోరాటమే.

2. మృత్యువులోని ముఖ్యాంశం

ఎవరూ చనిపోవడానికి ఒప్పకోరు. ఎందుకు? మనందరికీ జీవించాలనే కోరిక బలంగా వుంటుంది. చావు ఈ జీవాన్ని నాశం చేస్తుంది. అది నిరంకుశంగా మన ఆయుస్సుని త్రెంచివేస్తుంది. కనుకనే చావంటే ఎవరికీ గిట్టదు. కాని మరణంలోని ఈ నిరంకుశ గుణం ఎక్కడినుండి వచ్చింది? నరుల పాపంవల్లనే చావుకి ఈ నిరంకుశత్వం వచ్చింది. పాపం చేసిన నరుణ్ణి చావు చంపి తీరుతుంది - యేహె 18,20. దుష్టులు నాశమై పోవలసిందే - కీర్త 37,29. దేవుని ఆజ్ఞ మీరిందాకా ఆదాముకి చావులేదు. తినరాని పండు తిన్న తర్వాతనే అతనికి చావు వచ్చింది - ఆది 2, 17.

అసలు చావు ఎక్కడినుండి వచ్చింది? దేవుడు దాన్ని బుద్ధిపూర్వకంగా కలిగించలేదు. మన పాపంవల్లనే అది పుట్టుకవచ్చింది.

మృత్యువుని దేవుడు కలిగింపలేదు. ప్రాణులు చావడం చూచి అతడు సంతోషించడు. అతడు ప్రాణిని జీవించడానికే సృష్టించాడు - జ్ఞాన 1,13-14 మృత్యువు లోకలో రావడానికి నరుల పాపం మాత్రమేకాక పిశాచంకూడ కారణం.

దేవుడు నరుణ్ణి అమరుణ్ణిగా చేసాడు
అతన్ని తనలాగే నిత్యునిగా చేసాడు
కాని పిశాచం అసూయ వలన
మృత్యువు లోకంలోకి ప్రవేశించింది - 2, 23-24

కనుక పాపంవల్లనే చావ లోకంలోకి వచ్చింది అనేది పూర్వవేదం నొక్కి చెప్పే సూత్రం. చావులోని ముఖ్యాంశం ఇదే.