పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. నేడు భారతదేశంలో చాలమంది పనిని తప్పించుకొంటున్నారు, పనిచేయడం నామూషి అనుకొంటున్నారు. పని చేయకుండానే జీతాలు తీసికొని పోతున్నారు, ఇది దుష్ట విలువ, మనకు పనికిరాదు. శ్రమచేయందే సంపద ఏలా వుత్పత్తి ఔతుంది?

5. ఐనా పని నరుని కొరకు వుంది. నరుడు పనికొరకు లేడు. కనుక పని చేయడమే పరమార్థం అనుకోగూడదు. ఓ యంత్రంలా తయారు కాకూడదు. పనితోపాటు తగినంత విశ్రాంతి కూడ వుండాలి. అసలు స్వర్గంలో పనివుండదు. విశ్రాంతి మాత్రమే వుంటుంది.

6. తొలి పాపం తర్వాత పని కష్టమైంది. కనుక చాలమంది దాన్ని ఎగగొట్టాలని చూస్తుంటారు. ఐనా నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకో అనే దైవవాక్యాన్ని బిట్టి కష్టమైనా కూడ పనిని చేయవలసిందే. తప్పించుకోగూడదు. మనం చేసిన పనిని బట్టే మనకు విలువ వస్తుంది.

7. పని కష్టమైంది. అనిష్టమైంది కూడ. కనుక ఎప్పుడూ పనికి ఆనందాన్ని చేర్చుతూండాలి. పని చేసేవారికి ఆహ్లాదాన్ని చేకూర్చే పరిస్థితులను యజమానులు కల్పించాలి. పనినుండి ఆనందాన్ని తొలిగిస్తే అది యింకా దుర్భరమౌతుంది.

8. పని విలువ పనిని బట్టికాక దాన్నిచేసే వ్యక్తిని బట్టి వస్తుంది. కనుక చిన్న వృత్తులతో బ్రతికేవారి పనినీ, కూలివారి పనినీ చిన్నచూపు చూడకూడదు. ప్రతిపనీ విలువైందే. గాంధీగారు పాకీపని కూడ చేసారు.

9. భగవద్గీత నిష్కామకర్మ అనే భావాన్ని ప్రవేశపెట్టింది. అనగా స్వార్ధలాభంకొరకు కాక ప్రజాశ్రేయస్సు కొరకు పని చేయాలి. బాగా చేసిన పని లోకకల్యాణాన్ని సాధించిపెడుతుంది.

10. మన పనిలో చిత్తశుద్ధి వుండాలి. పైవారిని మెప్పించి గుర్తింపూ బహుమతులూ పొందడానికి మాత్రమే పని చేయకూడదు. మన పనిని క్రీస్తు పనితో చేర్చి పరలోకంలోని తండ్రికి అర్పించాలి. 'పని ఆరాధనగా మారాలి.