పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమర్పించుకొంటాం, దీనివలన మన క్రియలన్నీ పవిత్రమౌతాయి. గృహస్థలు పవిత్రతను సాధించడానికి ఈ సమర్పణం బాగా ఉపయోగపడుతుంది. ఇది సులువైన పద్ధతి కూడ. ఈ సమర్పణ ప్రార్ధనం మన జపపుస్తకాల్లో వుంది. మనంతట మనమే సొంతంగానే ఈ ప్రార్థనను చెప్పకోవచ్చు గూడ.

కట్టకడన పనిలోని యీ గొప్ప గుణాలను గూడ గుర్తిద్దాం. పనివాడి ముద్ర అతడు చేసిన పనిమీద పడుతుంది. శిల్పి ముద్ర బొమ్మమీద, రైతుముద్ర పొలంమీద, ఉపాధ్యాయుని ముద్ర విద్యార్ధులమీద పడుతుంది. పనివల్ల మనం ఉన్నతుల మౌతాం. కుటుంబాలు నిలుస్తాయి. కృషివల్ల వచ్చే ఆదాయమే కుటుంబాన్ని పోషిస్తుంది కదా! ఇంకా పనివల్ల దేశాలు జాతులు నిలుస్తాయి. శ్రమవల్ల సంపద ఉత్పత్తియై దేశాలు వృద్ది చెందుతాయి. ఇతరులతో కలసి పని చేయడం ద్వారా మనలోని స్వార్గాన్ని అణచుకొంటాం. కృషి ద్వారా ప్రకృతి శక్తులను లొంగదీసికొంటాం. నరులు వసించడానికి మరింత యోగ్యంగా వుండేలా ఈ లోకాన్ని తీర్చిదిద్దుతాం. బాగా చేసిన పని ఎంతో మందికి ఉపయోగపడుతుంది. కనుక అది సాంఘిక ప్రయోజనాన్నిగూడ సాధిస్తుంది. పూర్వులు పని చేయాలి. పని ద్వారా దేవుని సృష్టిని పరిపూర్ణం చేస్తాం. నూత్నయుగాన్ని సృజిస్తాం. నూత్నభువినీ నూత్న దివినీ రూపొందిస్తాం - 2 పేత్రు 3,13. కనుక శ్రమపట్ల మనకు గౌరవ భావాలుండాలి. శ్రమ ఏవ జయతే.

పర్యవసానాలు

పనిని గూర్చిన పూర్వ నూత్న వేదాల్లోని భావాలను చాల పరిశీలించాం. కడన కొన్ని పర్యవసానాలను తిలకిద్దాం.

1. భగవంతుడు క్రియాపరుడు. నరుడు అతనికి పోలికగా వుండేవాడు. మన గొప్పతనం ఆ భగవంతుని లాగ పని చేయడంలోనే వుంది. మనం ఈ లోకంలో దేవుని పనిని కొనసాగిస్తాం. నరుడు దేవుని హస్తం అనుకోవాలి.

2. క్రీస్తు వడ్రంగి. మనం పనిచేసినప్పడు అతనికి ప్రీతి కలిగిస్తాం. అతని మరణోత్థానాలు మన పనిని పునీతం చేస్తాయి.

3. పని చేయని నరుడు కూడు తినడానికి అర్హుడు కాడు అన్న పౌలు శాసనం మనకూ అక్షరాల వర్తిస్తుంది. కనుక మనకు సోమరితనం తగదు. సోమరిపోతులు చెడ్డ పౌరులు.