పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనం దేవునికి తోడి పనివాళ్లం - 1 కొ 3,9. అనగా అతనితో కలసి పని చేసేవాళ్లం. కనుక ఈ లోకంలో మనం చేయవలసిన ప్రధానకార్యం దైవరాజ్యాన్ని వ్యాప్తి చేయడమే. విత్తనం వెదజల్లడం మన బాధ్యత -1కొ 3,6. అనగా వాక్యాన్ని బోధించడం మన కర్తవ్యం. మనం క్రీస్తుకి రాయబారులం. క్రీస్తు ద్వారా పాపులను దేవునితో సఖ్యపరచవలసిన వాళ్లం - 2 కొ 5, 20. ఆత్మ ఒక్కొక్కరికి ప్రత్యేక వారాలిస్తుంది. ఆ వరాల సహాయంతో నేడు మనం తిరుసభ వ్యాప్తికి తోడ్పడాలి - 1 కొ 12, 7. కాని మనం చాలవరకు దైవరాజ్యాన్ని వ్యాప్తిచేయడమనే ముఖ్యమైన పనిని మానివేసి లోక కార్యాల్లో నిమగ్నుల మౌతున్నాం. స్వప్రయోజనాలను వెదుకుతున్నాం. ఈ విధంగా చేయవలసిన పనులు మానివేసి చేయగూడని పనులు చేస్తున్నాం. ఇది విచారింపవలసిన విషయం.

మన పనులను గూర్చిచెప్తూపౌలు ఓ అరుదైన సంగతి చెప్పాడు. స్త్రీలు బిడ్డలనుకనే ధర్మం వలన రక్షింపబడతారు అన్నాడు - 1 తిమో 2, 15. తొలి తల్లియైన ఏవ కాలం నుండి మాతృత్వం తల్లికి శాపంగా పరిణమించింది. కాని యిప్పడు క్రీస్తు సంపాదించి పెట్టిన రక్షణం వలన బిడ్డలను కనడం ద్వారా స్త్రీ రక్షణాన్ని పొందుతుంది. ఇది పెద్ద మార్పు.

పౌలు ఆనాటి బానిసలకు పని విషయంలో కొన్ని ఆజ్ఞలు జారీచేసాడు. ఆనాటి బానిసలు నేటి మన పనివారితో సమానం. కనుక మనం పని చేసేప్పడు ఈ సూత్రాలు పాటించాలి. మనం ఏ యజమానునికి పని చేస్తున్నమో అతనిలో క్రీస్తుని చూడాలి. ముఖప్రీతి కొరకూ నరులమెప్ప కొరకూ పనిచేయకూడదు. దేవుని పనీ, క్రీస్తుపనీ చేస్తున్నామో అన్నట్లు యజమానుని పనిని చిత్తశుద్ధితో చేయాలి. రోజువారి జీవితంలో ఈ సూత్రం మనకు ప్రేరణం పట్టిస్తుంది - ఎఫే 6,5-8. కోలో 3,23. ఇంకా పౌలు మనం చేసే ప్రతిపని క్రీస్తుపేరట చేయాలన్నాడు - కొలో 3,17. ఎందుకు? మన పనికి సార్ధక్యాన్ని ఇచ్చేది క్రీస్తే. తన మరణం ద్వారా మన పనిని పునీతం చేసేది అతడే. మన కార్యానికి విలువ వచ్చేది అతని నుండే కనుక మన కార్యాలను క్రీస్తు నామాన చేసి తండ్రికి అర్పించాలి.

క్రైస్తవులంగా మనం రెండు ముఖ్యమైన కార్యాలు చేయాలి. మొదటిది, క్రీస్తుపట్ల గాధమైన విశ్వాసాన్ని అలవర్చుకోవాలి. లోకంలోని జనం మన పనులను చూచి దేవుణ్ణి స్తుతించేలా మనం పనులను చేయాలి. అనగా మన కార్యాలు నిర్మలంగాను పవిత్రంగాను వండాలి - మత్త 5,16. మదర్ తెరేసా ఈ కార్యాన్ని చక్కగా సాధించింది. ధర్మశాస్త్రంలో