పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రొద్దుపొడవగానే నరుడు పనికి బయలుదేరుతాడు
సాయంకాలం వరకు పాటుపడతాడు

అని చెప్తుంది. ఇది చాల మంచి భావం. ఫలితార్థమేమిటంటే, నరుడు భగవంతునితో కలసి పనిని చేసేవాడు. అతని సృష్టిని పరిపూర్ణం చేసేవాడు. అతని చిత్తాన్నిపాటించేవాడు. అతనికి తోడి పనివాడు - 2 కొరి 6,1.

పూర్వవేదంలో యావే చేసిన రెండవపని, యిస్రాయేలీయులను ఫరో దాస్యం నుండి విడిపించడం. యోసేపు కాలంలో యూదులు ఫరో మన్నన పొందారు. గౌరవంగా బ్రతికారు. కాని కొన్నియేండ్లు కడచాక రమేసెస్ అనే క్రొత్త ఫరో అధికారంలోకి వచ్చాడు. ఇతడు యూదులకు శత్రువు, వారిని నాశం చేయడానికీ దీక్షపూనినవాడు. ఇతడు పెద్ద భవనాలు కట్టిస్తూ యూదులచే వెట్టిచాకిరి చేయించుకొన్నాడు. ఇక ఆ చాకిరికి అంతులేదు. యిస్రాయేలీయులు పడుతూ బానిసలుగా పుట్టారు. జీవిస్తూ బానిసలుగా జీవించారు. చనిపోతూ బానిసలుగా చనిపోయారు. ఈ బాధలు భరించలేక వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారిగోడు విని వారి కోపతీసికొన్నాడు. మోషే నాయకత్వం ద్వారా ఆ ప్రజను బానిసం నుండి విడిపించాడు. ఈ సందర్భంలో యావే మోషేతో ఈలా చెప్పాడు, "నేను ప్రభువును, ఐగుస్తీయులు మీ నెత్తికెత్తిన బరువును తొలగిస్తాను. వారి దాస్యం నుండి మీకు విముక్తి కలిగిస్తాను. శక్తిగల నా చేతిని చాచి మీ శత్రువులను శిక్షిస్తాను. మిమ్ము దాస్యంనుండి విడిపిస్తాను” - నిర్గ 6,6. తర్వాత అతడు చెప్పినట్లే చేసాడు. ఇదే దాస్య విముక్తి.

యావే యిస్రాయేలును దాస్యం నుండి విడిపించడం అతడు చేసిన రెండవ పెద్దపవి అని చెప్పాం. ఈ దాస్యవిముక్తినే పూర్వవేదం రక్షణం అని చెప్తుంది. పూర్వవేదంలో రక్షణం ప్రధానంగా పాపం నుండి కాదు, ఈజిప్టు దాస్యం నుండే. పాపం నుండి రక్షణం అనే భావం తర్వాతి కాలంలో వచ్చింది. కీర్తనకారులూ ప్రవక్తలూ పాపం నుండి రక్షణం అనే భావాన్ని ఎత్తుకొన్నారు. కాని అది తర్వాత వచ్చిన భావం. తొలిరక్షణం దాస్య విముక్తే.

యావే పని చేసేవాడు, అతనికి పోలికగా వున్న నరుడు కూడ పనిచేసేవాడు అనే అంశం పూర్వ వేదంలోని ప్రధాన భావాల్లో వొకటి. దేవుడే పని చేసేవాడు కనుక పని విలువైంది. గౌరవ ప్రదమైంది అని ఫలితార్థం.

2. తొలి పాపం తర్వాత పని భారమైంది.

ఆదిదంపతుల పాపం దేవుని రక్షణ ప్రణాళికను భగ్నం చేసింది. ఈ పాపం తర్వాత అంతవరకు సంతోషదాయకమైన పని దుఃఖ పూరితమైంది. తొలి పాపం తర్వాత ఆదామేవలు శాపం తెచ్చుకొన్నారు.