పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెలరేగుతున్నాయి. దౌర్జన్యాలు హింసలు పెచ్చుపెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం వేదప్రచారానికి పూనుకోవడం సబబు కాదని కొందరు భావిస్తున్నారు. ఇంకా, మన ప్రభుత్వం క్రైస్తవులైనవారికి ఉచిత వేతనాలు, ఉద్యోగవకాశాలు తగ్గిస్తుంది. కనుక చాలామంది క్రైస్తవులు కూడ హిందువులుగానే చలామణి కాగోరుతున్నారు. ఈలాంటి పరిస్థితుల్లో హిందువులను క్రైస్తవ మతంలోకి రాబట్టడ మెందుకని కొందరి వాదన.

3. పాశ్చాత్య దేశాల్లో కూడ ప్రజలకు క్రైస్తవమతం పట్ల ఆదరం సన్నగిల్లిపోతూంది. మతం వ్యక్తిగతమైన విషయమని పాశ్చాత్యుల వాదం. నరుడు క్రైస్తవుడుగా జీవించడం కంటె మంచి పౌరుడుగా, మంచి వ్యక్తిగా జీవించడం మెరుగని వీళ్ళ తలంపు. ఈలా క్రైస్తవ దేశాల్లోనే క్రైస్తవ మతం పట్ల అభిమానం క్షీణించి పోతూంది. ఈ దేశాల ప్రజలభావాలు మన ప్రజల్లో కూడ వేదబోధపట్ల ఆసక్తిని తగ్గిస్తున్నాయి.

4. మతమూ ఆధ్యాత్మిక విలువలూ వట్టిభ్రమ అని మార్మిస్టు నాయకులు చాలా కాలం నుండి వాదిస్తున్నారు. శ్రమజేసి సంపదను ఉత్పత్తి చేయడం, అలా ఉత్పత్తియైన సంపదను అందరూ కలసి సమంగా పంచుకోవడం ముఖ్యమని వీళ్ళ సిద్ధాంతం. వీళ్ళకు భగవంతుడు మత నియమాలు అట్టే రుచించవు. వీళ్ల భావాలుకూడ మన ప్రజల మీద సోకి వీళ్ళను ప్రభావితం చేస్తున్నాయి.

ఇలాంటి కారణాలు అనేకం మన ప్రజల్లో వేదబోధ పట్ల ఉత్సాహాన్ని చంపివేసాయి. ఐనా ఇవన్నీ తప్పుడు సిద్దాంతాలు. వేదబోధ ఎప్పుడూ అవసరమే. నేటి పరిస్థితుల్లో ఇంకా అవసరం.

2. భారతదేశ తిరుసభలో లోపాలు

ఇండియా దేశపు తిరుసభ కేవలం సంస్థలను నడిపే తిరుసభగా తయారైంది. భారత దేశ క్రైస్తవులు విద్యాసంస్థలు, ఆస్పత్రులు, సాంఘికసేవా సంస్థలు నడపడంతోనే సతమతమై పోతున్నారు. వీళ్ళకు విదేశ నిధులు ప్రధానం, నియమాలుపాటించడం ముఖ్యం. ఈలా మన దేశంలో సంస్థలను నడిపే తిరుసభ తానూ ఓ పెద్దసంస్థయిపోయింది.

భారతదేశ తిరుసభకు ప్రధానంగా కావలసింది దైవానుభూతి. మన ప్రజలు ఉత్థాన క్రీస్తుని అనుభవానికి తెచ్చుకోవాలి. అతడు తిరుసభలోని విశ్వాసుల్లోవుండి వారిని నడిపించే తీరును అర్థం చేసికోవాలి. ఇంకా, మన ప్రజలు పవిత్రాత్మ శక్తిని గుర్తించి ఆ యాత్మచే నడిపింపబడాలి.ఆత్మ దయచేసే వరాలను వాడుకోవాలి. పెంతెకోస్తు నాటి " అగ్ని మన హృదయాలకు ప్రేరణం పుట్టించాలి. కనుక మన తిరుసభ ఓ సంస్థగా జీవించడం మానివేసి ఓ భక్తసమాజంగా జీవించడం మొదలుపెట్టాలి.