పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పలుకులు తీరును జాగ్రత్తగా గమనిస్తూండు. నీ మాటలను మొదట తక్కెడలోబెట్టి తూయి. తర్వాత మాత్రమే వాటిని నీ నాలుకతో ఉచ్చరించు" అని మందలించాడు,

89. మనం పరవిమర్శకూ పరనిందకూ పూనుకోగూడదు, తుదితీర్పులో దేవుడు మనలను ఇతరులను గూర్చి అడగడు. మనమేమి చేసామో అడుగుతాడు. కనుక మనలను గూర్చి మనం లెక్కచెప్పకొంటే చాలు. ఇతరుల తప్పులు మనకు అనవసరం.

20. పుస్తకాలు

90. ఇగ్నేప్యస్ తన తనయులు తరచుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలని కోరాడు. ఆ గ్రంథాలు భక్తిని కలిగించేవిగా వుండాలి. తోడివారికి భక్తిని నేర్పించడానికి ఉపయోగపడేవిగా వుండాలి, అంతేగాని కేవలం మానవ విజ్ఞానాన్నీ పాండిత్యాన్నీ పెంచేవిగా వుండకూడదు. అతడు దైవసేవలోచేరి మగ్రేసా గుహలో తపస్సు చేసికొనే తొలి రోజుల్లోనే "క్రీస్తు అనుసరణ" గ్రంథాన్ని చూచాడు. అప్పటినుండి గ్రంథాన్ని ఎప్పడూ విడిచిపెట్టలేదు. అతనిదృష్టిలో అది ఆధ్యాత్మిక గ్రంథాల్లో ముత్యంలాంటిది. ఆ గ్రంథంనుండి ఒక్కో అధ్యాయాన్ని నిదానంగా చదివి దాని సారాన్ని గ్రహిస్తుండేవాడు. అతడు తన మిత్రులకు ఏదైనా బహుమతి ఈయాలనుకొన్నపుడు ఆ గ్రంథాన్నే యిచ్చేవాడు. బెబులు, క్రీస్తు అనుసరణం - ఇవి రెండే అతడు తనవద్ద నిరంతరం వుంచుకొన్న గ్రంథాలు,

21. భక్తిశ్రద్ధలు

91. సోమరితనం అన్ని అనర్ధాలకు మూలం. కనుక దానికి మన జీవితంలో తావుండకూడదు.

92. ఓ పనిని ఆలస్యంగా జేయడంకంటె ముందుగానే చేయడం మంచిది. కావున నీవేదైనా కార్యాన్ని రేపచేస్తానని మాటయిస్తే ఈనాడే చేయి.

93. చాలపనులను ఒకేసారి నెత్తిన పెట్టుకోగూడదు. ఒక్కోవిడత ఒక్కోకార్యాన్ని మాత్రమే చేసేవాడు దాన్ని చక్కగా చేస్తాడు.

94. మనం దుర్భలులనూ సోమరిపోతులనూ ఆదర్శంగా తీసికోగూడదు. ధైర్యశాలులనూ భక్తిమంతులనూ ఆదర్శంగా పెట్టుకోవాలి.

95. వింటిని అతిగా వంచితే విరిగిపోతుంది, కనుక దాన్ని విప్పివుంచాలి. కాని ఆత్మను పనిపాటలు లేకుండా కులాసాగా వంచితే అది పూర్తిగా చెడిపోతుంది,

96. సోమరిపోతు"చాలకాలం కృషిజేసి సాధించిన పుణ్యానికంటె భక్తిమంతుడు కొద్దికాలంలోనే ఎక్కువ పుణ్యాన్ని ఆర్థిస్తాడు.