పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67. ఇగ్నేష్యయస్ దృష్టిలో "తపోఖ్యాసాలు" అమూల్యమైన వరప్రసాదాలను దయచేసే సాధనాలు. కనుక అతడు తనకు మేలు చేసిన వారందరిచేత తపోభ్యాసాలు చేయించగోరేవాడు. తన ఋణాన్ని తీర్చుకోడానికి ఇది ఉత్తమ మార్గమని యెంచేవాడు. ఈ జీవితంలో తాను ఇంతకంటె మంచికార్యం ఏమీ చేయించలేనని తలంచేవాడు,

68. చాల వేదసత్యాలను తెలుసుకొన్నంత మాత్రాన్నే మన ఆత్మకు తృప్తి కలుగదు. ఏదైనా వొక వేదసత్యాన్ని బాగా అర్థంచేసికొని దాన్ని ఆంతరంగికంగా రుచిచూడ్డంవల్ల ఆత్మ సంతృప్తి చెందుతుంది,

69. మనం ప్రార్ధనం చేసికొనేప్పడు మాత్రమే దేవుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకొంటే చాలదు. మన పనులన్నిటిలోను అతన్ని గుర్తుపెట్టుకొంటూండాలి. మన పనులన్నిటినీ జపాత్మాకంగా చేయాలి. మన జీవితమంతా ప్రార్ధనం కావాలి.

70. మనం ధ్యానంచేసి ముగించాక దాన్ని ఏలా చేసామా అని ఒకటి రెండు నిమిషాలు పరిశీలించి చూచుకోవాలి. దాన్ని బాగా చేసినట్లయితే దేవునికి వందనాలు చెప్పాలి. బాగా చేయనట్లయితే కారణమేమిటా అని పరిశీలించి చూచుకోవాలి. మన తప్పిదానికి పశ్చాత్తాపపడి మరుసటిసారి దాన్నింకా బాగా చేయాలని సంకల్పించుకోవాలి.

71. గురుజీవితానికి తయారయ్యే బ్రదర్లు తమ చదువులను తామపడే శ్రమలను పలుమార్లు దేవునికి సమర్పించు కోవాలి. అవి తమకు ఇష్టమైనా కాకపోయినా దేవుని ప్రేమకొరకు వాటిని అంగీకరించాలి. భావిజీవితంలో ఆత్మలకు సహాయం చేయడానికీ దేవునికి సేవలు చేయడానికీ ఆకార్యాలు ఏదోరీతిలో ఉపయోగపడతాయి.

13. తపస్సు

72. మనదేహం మనదికాదు, దేవునిది. కనుక మనం దాన్ని ఏలా వాడుకొన్నామో ఓనాడు దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. మన శరీరాన్ని సుఖభోగాలతో చెడగొడితే దేవునికి లెక్క చెప్పాలి. లేదా శరీరాన్ని తీవ్రంగా కృశింపజేసి దాని వలన పొందవలసిన మేళ్ళను పొందకపోయినా దేవునికి జవాబుదారులం కావాలి.

73. మన శరీరం మన ఆత్మకు లొంగి వుండాలి. శరీరం ఆత్మకు లొంగకుండా ఎదురు తిరిగి పాపకార్యాలను అభిలషిస్తే, మనం వెంటనే దాన్ని అదుపులోకి తీసికొని రావాలి. తపస్సును చేపట్టి శరీరవాంఛలను అణచివేసి కోవాలి. అప్పడది తిరుగుబాటును మానుకొని ఆత్మకు లొంగి, తన బాధ్యత ప్రకారం ప్రవర్తిస్తుంది. తాను ఆత్మకు సేవకుణ్ణని గ్రహిస్తుంది.